Site icon NTV Telugu

Annamalai: డీఎంకే తమిళనాడుకి శత్రువు.. కోయంబత్తూర్‌ రోడ్ షోలో అన్నామలై..

Annamalai

Annamalai

Annamalai: తమిళనాడు బీజేపీ చీఫ్ కే. అన్నామలై అధికార డీఎంకే పార్టీపై విరుచుకుపడ్డారు. కోయంబత్తూర్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న ఆయన ఈ రోజు భారీ రోడ్ షో నిర్వహించారు. మదురైలోని తెప్పకుళం మైదానంలో ఉదయం 11 గంటలకు ఈ రోడ్ షో ప్రారంభమైంది. తమిళనాడుకి, తమిళ ప్రజలకు డీఎంకే శత్రువుగా మారిందని ఆయన ఆరోపించారు. మోడీ మార్గంలోకి తమిళనాడు వస్తుందని జూన్ 4న వెలువడే ఫలితాలు ధ్రువీకరిస్తాయని అన్నామలై అన్నారు.

Read Also: Earth: భూ ఉపరితలం కింద 700 కి.మీ. దిగువన భారీ సముద్రం.. సైంటిఫిక్ డిస్కవరీ వైరల్..

కోయంబత్తూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి మార్చి 28న అన్నామలై నామినేషన్ దాఖలు చేశారు. కర్ణాటక కేడర్ ఐపీఎస్ అధికారి అన్నామలై 2019లో సర్వీసుకు రాజీనామా చేసి 2020లో బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన ఏడాదికే బీజేపీ అధిష్టానం ఆయనను రాష్ట్ర అధ్యక్షుడిగా చేసింది. ఈసారి తమిళనాడులో బీజేపీ సత్తా చాటాలని భావిస్తోంది. ఇందుకు తగ్గట్లుగానే ప్రధాని మోడీతో పాటు అన్నామలై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

మొత్తం 39 స్థానాలు ఉన్న తమిళనాడులో ఏప్రిల్ 19న మొదటిదశలో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. 2019లో డీఎంకే-కాంగ్రెస్ కూటమి 23, 08 లోక్ సభ స్థానాలను గెలుచుకున్నాయి. సీపీఐ రెండు, సీపీఎం, ఐయూఎంల్ఎల్ ఒక్కోస్థానాన్ని దక్కించుకోగా.. రెండు స్థానాల్లో స్వతంత్రులు విజయం సాధించారు. దేశంలోని 543 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు ఏప్రిల్ 19 నుండి ఏడు దశల్లో జరుగుతాయి. దాదాపు 97 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.

Exit mobile version