Anil Vij: హర్యానా అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మరోసారి అధికారంలోకి వచ్చి హ్యట్రిక్ కొట్టాలని బీజేపీ భావిస్తుంటే, ఈ సారి ఎలాగైనా బీజేపీ అడ్డుకుని అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు కావడంతో అందరి దృష్టి హర్యానా ఎన్నికలపై కేంద్రీకృతమైంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం బీజేపీ నేత, హర్యానా మంత్రి అనిల్ విజ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Read Also: Working Age Population: భారత్‌కి గుడ్ న్యూస్.. 2045 నాటికి మరో 17.9 కోట్ల మంది “పనిచేసే జనాభా”..
బీజేపీ గెలిస్తే రాష్ట్రంలో అత్యున్నత పదవి కోసం బరిలోకి దిగుతానని, సీఎం పదవి గురించి చాలా మంది ప్రజల నుంచి ఒత్తిడి ఉందని ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. తనకు అవకాశం ఇస్తే హర్యానాను మారస్తానని పేర్కొన్నారు. అనిల్ విజ్ హర్యానా బీజేపీలో అగ్ర నాయకుడిగా ఉన్నారు. గతంలో రెండు సార్లు సీఎం పీఠానికి దూరమయ్యారు. ఒకసారి మనోహర్ లాల్ కట్టర్ రూపంలో, రెండోసారి నయాబ్ సింగ్ సైనీ రూపంలో విజ్ ఆశలు ఫలించలేదు.
2014 ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తర్వాత సీఎం పదవి రేసులో అనిల్ విజ్ ముందున్నారు. అయితే, అనూహ్యంగా బీజేపీ అధిష్టానం మనోహర్ లాల్ కట్టర్‌ని సీఎంగా ఎన్నుకుంది. కట్టర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి అత్యంత సన్నహితుడు. కట్టర్‌ని సీఎం చేసి, అనిల్ విజ్‌కి రాష్ట్ర హోంమంత్రి పదవిని కట్టబెట్టారు. ఈ ఏడాది కట్టర్ సీఎం పదవి నుంచి దిగిపోయిన తర్వాత ముఖ్యమంత్రి పదవి లభిస్తుందని అంతా అనుకున్నప్పటికీ, నాయాబ్ సింగ్ సైనీకి బీజేపీ అవకాశం కల్పించింది. అక్టోబర్ 5న హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. అక్టోబర్ 08న ఓట్ల లెక్కింపు ఉండనుంది. ఈసారి అంబాలా కంటోన్మెంట్ నుంచి అనిల్ విజ్ బరిలోకి దిగుతున్నారు.