Site icon NTV Telugu

Love Jihad: ‘‘లవ్ జిహాద్’’ ఆరోపణలు.. సెలూన్‌పై బీజేపీ కార్యకర్తల దాడి.. వీడియో వైరల్..

Love Jihad

Love Jihad

Love Jihad: ‘‘లవ్ జిహాద్’’ ఆరోపణల నేపథ్యంలో పూణేలోని కోత్రుడ్ ప్రాంతంలోని ఓ సెలూన్‌పై దాడి చేసి, అందులోని సిబ్బందిని బీజేపీ కార్యకర్తలు చితకబాదారు. ఒక సెలూన్‌ని ధ్వంసం చేశారు. ఒక హిందూ అమ్మాయిని, సెలూన్‌లో పనిచేస్తున్న ఉద్యోగి బలవంతంగా ఇస్లాం స్వీకరించాలని ఒత్తిడి చేస్తున్నట్లు బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. సోమవారం జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కోత్రుడ్ లోని అర్ష్ యునిసెక్స్ సెలూన్ ఉద్యోగి అర్మాన్ ఖాన్‌, బలవంతంగా సదరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని, ఆమె ఇష్టానికి విరుద్ధంగా ఇస్లాం మారాలని ఒత్తిడి చేస్తున్నాడని బీజేపీ కార్యకర్త ఉజ్వల గౌడ్ ఆరోపించారు. ఈ విషయంపై సైలెంట్‌గా ఉండాలని కోరుతూ అతడు అమ్మాయికి రూ. 1 లక్ష ఇచ్చాడని ఆమె పేర్కొంది. వైరల్ అవుతున్న వీడియోలో బీజేపీ కార్యకర్తలు సెలూన్‌లోకి ప్రవేశించి నల్ల రంగు పెయింట్‌తో సిబ్బందిని బెదిరించారు. సెలూన్ ధ్వంసం చేసి మూసేయాలని ఆదేశించారు. ఆ తర్వాత సిబ్బందిపై దాడి చేశారు.

Read Also: CMF Phone 2: మరోమారు అద్భుత ఆవిష్కరణకు సిద్దమైన CMF.. కొత్త ఫోన్ లాంచ్కు డేట్ లాక్

ఈ ఘటనపై కోత్రుడ్ పోలీస్ అధికారి సందీప్ దేశ్‌మనే మాట్లాడారు. ‘‘ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆ అమ్మాయి ఒక ఏడాది క్రితం అర్మాన్‌ని పెళ్లి చేసుకుంది. డబ్బు విషయంలో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. వీరిద్దరు ఒకే సెలూన్‌లో పనిచేస్తున్నారు. అర్మాన్, అమ్మాయి ఒక పీజీ గదిలో నివసిస్తున్నారు. దీనికి సెలూర్ ఓనర్ డబ్బు చెల్లిస్తున్నాడు. సరిగా పనిచేయకుంటే అద్దె చెల్లించనని ఓనర్ ఇటీవల బెదిరించాడు’’ అని దేశ్‌మనే చెప్పారు.

డీసీపీ సంభాజీ కదమ్ మాట్లాడుతూ.. ‘‘”లవ్ జిహాద్ ప్రమేయం ఉందని లేదా అమ్మాయిని బలవంతంగా కల్మా పఠించమని సూచించే సాంకేతిక ఆధారాలు కనుగొనబడలేదు. మేము ఆమె వాంగ్మూలాన్ని లిఖితపూర్వకంగా, వీడియోలో రికార్డ్ చేసాము. ఈ విషయం దర్యాప్తులో ఉంది’’ అని చెప్పారు. తెలిసిన విషయాల ప్రకారం, సెలూన్‌లో అర్మాన్, అమ్మాయి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీని తర్వాత అమ్మాయి ఒక స్నేహితుడిని సంప్రదించింది, ఆ తర్వాత బీజేపీ కార్యకర్తలు ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు. అయితే, ఈ ఘటనలో ఆ అమ్మాయి హిందువు కాదని, క్రైస్తవురాలని తేలింది.

Exit mobile version