NTV Telugu Site icon

Sandeshkhali: మహిళలపై టీఎంసీ నేత అఘాయిత్యాలతో అట్టుడుకుతున్న “సందేశ్‌ఖాలీ”..

Bengal's Sandeshkhali

Bengal's Sandeshkhali

Sandeshkhali: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో “సందేశ్‌ఖాలీ” ప్రకంపనలు రేపుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత షాజహాన్ షేక్, అతని అనుచరుల చేతిలో లైంగిక వేధింపులు, చిత్ర హింసలకు గురైన మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఆందోళనలకు బీజేపీ మద్దతు తెలుపుతోంది. సోమవారం గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ మహిళలతో మాట్లాడారు. మహిళలు తాము ఎదుర్కొన్న అఘాయిత్యాలు., అన్యాయాల గురించి గవర్నర్ వద్ద వెల్లబోసుకున్నారు.

Read Also: Farmers Protest: “బలాన్ని ఉపయోగించడం..” రైతుల ఆందోళనపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

మంగళవారం బీజేపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. బీజేపీ మద్దతుదారులు ఎస్పీ కార్యాలయం వైపు మార్చ్‌గా వెళ్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకోవడం ఆందోళనకు దారి తీసింది. లాఠీచార్జి చేసి పోలీసులు గుంపును చెదరగొట్టారు. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. 24 పరగనాల జిల్లాలోని సందేశ్‌ఖాలీ ప్రాంతంలో షాజహాన్ షేక్ అన్యాయాలు, లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా.. తన భూముల్ని స్వాధీనం చేసుకున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు.

గత నెలలో రేషన్ కుంభకోణం కేసులో షాజహాన్ ఇంట్లో సోదాలకు వెళ్లిన సమయంలో ఈడీ అధికారులపై అతడు, అతని అనుచరులు దాడి చేశారు. అప్పటి నుంచి అతను పరారీలో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే మహిళలపై అతడు, అతని గుండాల ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు, సందేశ్‌ఖాలీలో సిఆర్‌పిసి సెక్షన్ 144 కింద నిషేధ ఉత్తర్వులు జారీ చేయడాన్ని కలకత్తా హైకోర్టు మంగళవారం పక్కన పెట్టింది. ఆ ప్రాంతంలోని నిషేధాజ్ఞలను ఎత్తివేసేలా ఆదేశించాలని కోరుతూ సందేశ్‌ఖాలీకి చెందిన ఇద్దరు నివాసితులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.