NTV Telugu Site icon

Amit Shah: గిరిజనులపై ‘‘లవ్ జిహాద్’’, ‘‘ల్యాండ్ జిహాద్’’.. సీఎం గిరిజనుడై ఉండీ వీటికి మద్దతు..

Amit Shah

Amit Shah

Amit Shah: జార్ఖండ్ రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ కార్యకర్తలతో సమావేశమైన ఆయన రాష్ట్రంలో గిరిజన ప్రదేశాల్లో చొరబాట్లు పెరిగాయని, దీంతో గిరిజన జనభా తగ్గిపోతోందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే, గిరిజనులను కాపాడేందుకు వారి భూములు- రిజర్వేషన్లు- హక్కులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని శనివారం పేర్కొన్నారు.

Read Also: Bangladesh Protests: బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు 1000 మంది విద్యార్థులు.. చిక్కుకుపోయిన 4000 మంది..

వేలాది మంది చొరబడి గిరిజన యువతులను పెళ్లిళ్లు చేసుకుంటూ, సర్టిఫికేట్లు పొంది వారి భూములను కొనుక్కుంటున్నారని, రాబోయే రోజుల్లో గిరిజనుల సంఖ్య తగ్గతుందని అమిత్ షా అన్నారు. ఒక గిరిజనుడు ముఖ్యమంత్రి అయి ఉండీ రాష్ట్రంలో ‘‘ల్యాండ్ జిహాద్’’, ‘‘లవ్ జిహాద్’’ కి మద్దతు ఇస్తున్నాడని, జనాభా సమతుల్యతను దెబ్బతీస్తున్నాడని ఆరోపించారు.

లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ రాహుల్ గాంధీ అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని, ఆయనతో పాటు ఇండియా కూటమి, కాంగ్రెస్ నాయకులు వారి ఓటమిని అంగీకరించలేకపోతున్నారని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 81 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇప్పటికే 52 సెగ్మెంట్లలో కమలం వికసించిందని, వచ్చే ఎన్నికల్లో్ బీజేపీదే అధికారమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇండియా కూటమి నేతలు బుజ్జగింపులు, వంశపారంపర్య రాజకీయాలు చేస్తున్నారని, దేశభద్రతతో ఇండియా కూటమి, కాంగ్రెస్ నేతలు ఆడుకుంటున్నారని ఆరోపించారు. జేఎంఎం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం దేశంలోని అత్యంత అవినీతి ప్రభుత్వాల్లో ఒకటని, ఇది దిగిపోవాల్సిన సమయం వచ్చిందని అమిత్ షా అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి, లక్ష్మీకాంత్ బాజ్‌పాయ్, అర్జున్ ముండా సహా బీజేపీ నేతలు కూడా పాల్గొన్నారు.