BJP state in-charges meeting: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సిద్ధం అవుతోంది. కేంద్ర మంత్రులు, జాతీయాధ్యక్షుడు, ఇతర కీలక నేతలు తరుచుగా పలు రాష్ట్రాలను సందర్శిస్తున్నారు. ఇటీవల బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 2024 లోక్ సభ ఎన్నికలపై చర్చ జరిగింది. గతంలో బీజేపీ పార్టీ తక్కువ మెజారిటీతో ఓడిపోయిన 100కు పైగా నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సమావేశంలో దిశానిర్ధేశం చేశారు.
ఇదిలా ఉంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల సమావేశం సెప్టెంబర్ 27న జరగబోతోంది. ఈ సమావేశానికి బీజేపీ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) బీఎల్ సంతోష్ అధ్యక్షత వహిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సమావేశానికి పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కేంద్ర నాయకత్వం కూడా రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. దక్షిణాదిలో ముఖ్యం తెలంగాణ, తమిళనాడును టార్గెట్ చేసింది బీజేపీ.
Read Also: Osmania University: దారుణం.. యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి
2024 ఎన్నికలే టార్గెట్ గా రాష్ట్ర అధ్యక్షుల సమావేశం నిర్వహిస్తోంది బీజేపీ అధిష్టానం. మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఇప్పటి నుంచే పకడ్భందీగా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసమే రాష్ట్రాల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గతంలో తమ ఉనికి లేని రాష్ట్రాల్లో ఓట్ల శాతంతో పాటు సీట్లను పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇక పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా బీజేపీ బలోపేతంలో భాగంగా ఇటీవల పలు రాష్ట్రాల్లో పర్యటనలు చేస్తున్నారు. గురువారం నుంచి తమిళనాడులో రెండు రోజులు పర్యటించారు. దక్షిణాదిలో బీజేపీ పట్టుపెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ నెలలోనే ఎన్నికలు జరగబోయే గుజరాత్ లో పర్యటించనున్నారు.