NTV Telugu Site icon

Mamata Banerjee: లోక్‌సభ ఎన్నికలపై దీదీ కీలక వ్యాఖ్యలు.. మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే…

Mamata Banerjee

Mamata Banerjee

Mamata Banerjee: 2024 లోక్‌సభ ఎన్నికలపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. మళ్లీ, మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే దేశంలో నిరంకుశ పాలన ఉంటుందని ఆమె అన్నారు. ఎన్నికల ప్రచారానికి బీజేపీ పార్టీ అన్ని హెలికాప్టర్లను బుక్ చేసిందని ఆమె ఆరోపించారు. టీఎంసీ యువజన విభాగం ర్యాలీలో పాల్గొన్న దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ ఈ ఏడాది డిసెంబర్ లో లేదా వచ్చే ఏడాది జనవరిలో పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని ఆమె అన్నారు. దేశంలో వివిధ వర్గాల మధ్య బీజేపీ విద్వేషాలను పెంచిందని, మళ్లీ అధికారంలోకి వస్తే దేశాన్ని విద్వేషపూరితంగా మారుస్తుందని మమతా బెనర్జీ ఆరోపించారు.

గవర్నర్ సివి ఆనంద బోస్ రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని దీదీ ఆరోపించారు. ఎన్నికైన ప్రభుత్వాన్ని సవాల్ చేయవద్దని పరోక్షంగా హెచ్చరించారు. బెంగాల్లో మూడు దశాబ్ధాల కమ్యూనిస్ట్ పాలనను అంతం చేశామని, వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలో ఆదివారం ఉదయం అక్రమ బాణసంచా కర్మాగారంలో జరిగిన పేలుడు ఘటనలో తొమ్మిది మంది మృతి చెందడం గురించి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. కొందరు చట్ట విరుద్ధ కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, వీటికి కొందరు పోలీసులు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. జాదవ్ పూర్ యూనివర్సిటీలో గోలీమార్ నినాదాలు చేసిన ఏబీవీపీ కార్యకర్తలను ఆరెస్ట్ చేయాలని ఆదేశించానని, ఇది బెంగాల్ అని మరిచిపోవద్దని, ఇది ఉత్తర ప్రదేశ్ కాదని హెచ్చరించారు.