NTV Telugu Site icon

Wayanad: ప్రియాంక విజయంపై హైకోర్టులో నవ్య సవాల్.. అక్రమాలు చోటుచేసుకున్నాయని పిటిషన్

Navyapriyankagandhi

Navyapriyankagandhi

వయనాడ్‌లో ప్రియాంకాగాంధీ విజయాన్ని సమీప బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ కేరళ హైకోర్టులో సవాల్ చేశారు. ప్రియాంక నామినేషన్ పత్రాల్లో వ్యత్యాసాలు ఉన్నాయని.. ఆమె కుటుంబ ఆస్తులు కూడా తప్పుగా ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా మోడల్ ప్రవర్తనా నియమావళిని కూడా ఉల్లంఘించారని ఆరోపించారు. ఓటర్లను కూడా తప్పుదారి పట్టించారని.. అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని నవ్య పిటిషన్‌లో ఆరోపించారు. అయితే డిసెంబర్ 23 నుంచి జనవరి 5 వరకు హైకోర్టుకు క్రిస్మస్ సెలవులు ఉన్నాయి. సెలవులు అనంతరమే నవ్య పిటిషన్‌ న్యాయస్థానం విచారించనుంది.

వయనాడ్ ఉపఎన్నికలో ప్రియాంక గాంధీ విజయం సాధించడంతో రాజకీయ అరంగేట్రం ప్రారంభమైంది. ఆమెకు 6,22,338 ఓట్లు రాగా, మూడో స్థానంలో నిలిచిన హరిదాస్‌కు 1,09,939 ఓట్లు వచ్చాయి. దాదాపు 5లక్షలకు పైగా ఓట్ల తేడాతో నవ్య పరాజయం పాలయ్యారు. తాజాగా నవ్య హరిదాస్.. ప్రియాంక విజయాన్ని కోర్టులో సవాల్ చేశారు. అక్రమాలకు పాల్పడడం వల్లే ప్రియాంక విజయం సాధించారని ఆమె విమర్శించారు. ఓటర్లను తప్పుదోవ పట్టించడం వల్లే ప్రియాంక గెలిచిందని పేర్కొన్నారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి రెండు చోట్ల గెలుపొందారు. అయితే వయనాడ్ వదులుకుని రాయ్‌బరేలీ స్థానం ఉంచుకున్నారు. దీంతో వయనాడ్‌లో బైపోల్ అనివార్యమైంది. ఇక్కడ ప్రియాంక నిలబడి భారీ విజయాన్ని అందుకున్నారు.

Show comments