NTV Telugu Site icon

BJP: ముస్లిం మత నాయకుడు నోమానీపై ఫిర్యాదు చేసిన బీజేపీ..

Nomani

Nomani

BJP: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో వివాదాస్పద ఫత్వా జారీ చేసిన ఇస్లామిక్ మత నాయకుడు మౌలానా సజ్జాద్ నోమానీపై బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు జమాల్ సిద్ధిఖీ ఢిల్లీలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్-ఉద్ధవ్ ఠాక్రే-శరద్ పవార్ కూటమికి ఓటేయాలని రాష్ట్రంలో ముస్లింలకు పిలుపునివ్వడంపై వీడియో వైరల్‌గా మారింది. మహారాష్ట్రలో బీజేపీ ఓటమి కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచగలదని తాను నమ్ముతున్నానని నోమని అన్నారు. ఈ వీడియోపై మహారాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ, కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలు ఓటమి భయంతో సమాజాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్నాయని పేర్కొంది.

Read Also: Bandi Sanjay : ‘ది సబర్మతి రిపోర్ట్’ మూవీ టాక్స్ మినహాయింపు ఇవ్వండి

ఇదే కాకుండా.. నోమానీ మాట్లాడుతూ.. బీజేపీతో సంబంధం ఉన్న ముస్లింలను బహిష్కరించాలని, ఇస్లాం నుంచి తిరస్కరించాలని ఫత్వాలో పేర్కొన్నాడు. వివాదాస్పద ఫత్వాకు సంబంధించిన వీడియో కూడా విడుదలైంది. బీజేపీకి పనిచేస్తున్న ముస్లింలను విస్మరించాలని చెప్పారు. నోమానీ వ్యాఖ్యలు మహారాష్ట్రలో పాటు దేశవ్యాప్తంగా వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో విషయం తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిద్ధిఖీ ఢిల్లీ పోలీసులను కోరారు. ఈ ప్రకటన వల్ల సమాజంలో చీలికలు ఏర్పడి మత సామరస్యాలు చెలరేగే ప్రమాదం ఉందని, తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారుడు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

‘‘ మసీదులు, ఇతర ప్రార్థనా స్థలాల వద్ద వారు(ముస్లింలు) ధిక్కారం, బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. మౌలానా ప్రకటనకు ప్రభావితమై, చాలా మంది వ్యక్తులు సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు’’ అని తనతో పాటు ఇతరులు కూడా బెదిరింపులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. నోమానీ తన వివాదాస్పద వ్యాఖ్యల్లో బీజేపీకి పనిచేసే ముస్లింలను ఘనశ్యామ్ అని పిలువాలని కోరారని, అటువంటి ఫత్వా కారణంగా, సమాజంలో విభజన, వారి జీవితాలకు ప్రమాదంతో పాటు మతసామరస్యం దెబ్బతింటుందని సిద్ధిఖీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.