Mood of the Nation survey 2026: గత ఎన్నికల్లో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో సీట్లు రాలేదు.. దీంతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.. అయితే.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.. దేశంలో ఇప్పుడే లోక్‌సభ ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) స్పష్టమైన ఆధిక్యంతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని తాజా సర్వే వెల్లడించింది. ఇండియా టుడే – సీ ఓటర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్ (MOTN)’ సర్వే ప్రకారం, NDA మొత్తం 352 లోక్‌సభ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఈ అంచనాల ప్రకారం, బీజేపీ ఒక్క పార్టీకే 287 సీట్లు దక్కే అవకాశం ఉండటంతో, పార్టీ సొంతంగా మెజారిటీ సాధించే పరిస్థితి కనిపిస్తోంది. ఇది ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బీజేపీకి భారీ ఊపునిచ్చే అంశంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఓట్ల శాతం ఎలా ఉంది..?
ఈ సర్వే ప్రకారం.. ఓట్ల వాటా పరంగా చూస్తే,
* NDA – 47 శాతం
* ఇండియా బ్లాక్ – 39 శాతం
* ఇతర పార్టీలు – 14 శాతం ఓట్లు సాధించనున్నారు..
అంటే, ఓట్ల శాతం విషయంలోనూ NDAకి స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో NDAకి 43 శాతం ఓట్ల వాటా లభించగా, ఇండియా బ్లాక్‌కు 40 శాతం ఓట్లు వచ్చాయి. ఈ సర్వేను డిసెంబర్ 8, 2025 నుంచి జనవరి 21, 2026 వరకు నిర్వహించారు. దేశవ్యాప్తంగా అన్ని వయసులు, కులాలు, మతాలు, ఆడ, మగ ఇలా 36,265 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. అయితే, గణాంకాల్లో సుమారు ±5 శాతంలోపం ఉండే అవకాశం ఉందని సర్వే నిర్వాహకులు తెలిపారు.
సీట్ల అంచనాలు
‘ఈరోజే లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఫలితం ఎలా ఉంటుంది?’ అనే ప్రశ్నకు సర్వే ఇచ్చిన అంచనాలు ఇలా ఉన్నాయి..
* NDA – 352 సీట్లు
* ఇండియా బ్లాక్ – 182 సీట్లు
* ఇతరులు – 9 సీట్లు
అయితే, గత ఎన్నికలు, గత సర్వేతో పోలిస్తే.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో NDA 293 సీట్లు, ఇండియా బ్లాక్ 234 సీట్లు గెలుచుకున్నాయి. అలాగే, ఆగస్టు 2025లో నిర్వహించిన MOTN సర్వేలో NDAకి 324 సీట్లు, ఇండియా బ్లాక్‌కు 208 సీట్లు వస్తాయని అంచనా వేశారు. తాజా సర్వేలో NDA సీట్ల సంఖ్య మరింత పెరిగినట్లు స్పష్టమవుతోంది. తాజా సర్వే ఫలితాలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలు, నాయకత్వంపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసమే NDAకి ఈ ఆధిక్యానికి కారణమని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, ఇండియా బ్లాక్ ఈ సర్వేలను జాగ్రత్తగా తీసుకోవాలని, అసలు పోరు ఎన్నికల సమయంలోనే తేలుతుందని అంటోంది.