NTV Telugu Site icon

Delhi: అమిత్ షాతో భేటీకానున్న మహాయుతి అగ్ర నేతలు.. మహారాష్ట్ర సీఎంపై వీడనున్న ఉత్కంఠ

Unionhomeminister

Unionhomeminister

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకుంది. అయితే ముఖ్యమంత్రి పదవిపై మాత్రం పంచాయితీ వీడలేదు. ఏక్‌నాథ్ షిండేను తిరిగి ముఖ్యమంత్రిని చేయాలంటూ శివసేన డిమాండ్ చేస్తోంది. లేదు.. లేదు.. బీజేపీకే సీఎం పీఠం దక్కాలంటూ కమలనాథులు పట్టుబడుతున్నారు. ఇలా దాదాపుగా 8 రోజులుగా చర్చోప చర్చలు జరుగుతున్నాయి. ఉత్కంఠ మాత్రం వీడలేదు. తాజాగా ఇదే వ్యవహారంపై హైకమాండ్ పెద్దలతో చర్చించేందుకు దేవేంద్ర ఫడ్నవిస్, ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ఢిల్లీ చేరుకున్నారు. మరికాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీకానున్నారు.

ఇదిలా ఉంటే మహారాష్ట్ర సీఎం పీఠం బీజేపీనే సొంతం చేసుకోవాలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. తాజా సమావేశంలో ఏక్‌నాథ్ షిండేను ఒప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే షిండే కూడా వెనక్కి తగ్గినట్లుగా సమాచారం. మొత్తానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి బీజేపీకి దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీ 132 స్థానాలు సొంతం చేసుకుంది. శివసేన 57, ఎన్సీపీ 41, ఉద్ధవ్ థాక్రే పార్టీ 20, కాంగ్రెస్ 16, శరద్ పవార్ 10 స్థానాలు గెలుచుకున్నారు. బీజేపీకి మెజార్టీ సీట్లు ఉన్నా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది.