NTV Telugu Site icon

Arvind Kejriwal: కేజ్రీవాల్ కోసం అంబులెన్స్ పంపిన బీజేపీ నాయకుడు.. ఎందుకంటే..

Kejriwal

Kejriwal

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నిందితుడుగా ఉన్నారు. మార్చిలో ఈడీ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేయగా, 50 రోజులు తీహార్ జైలులో ఉన్న తర్వాత, ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న ఆయన లొంగిపోవాల్సి ఉంది. ఇదిలా ఉంటే, తాను అనారోగ్య కారణాలతో బాధపడుతున్నట్లు కేజ్రీవాల్ చెప్పారు. పీఈటీ-సీటీ స్కాన్‌తో సహా కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన నేపథ్యంలో మరో ఏడు రోజులు తన మధ్యంతర బెయిల్ పొడగించాలని కోరుతూ కేజ్రీవాల్ మే 26న సుప్రీంకోర్టు ఆశ్రయించారు. అతను జైలులో 7 కిలోల బరువు కోల్పోయాడని మరియు అతని కీటోన్ స్థాయిలు “చాలా ఎక్కువ” ఉన్నాయని పేర్కొన్నాడు.

Read Also: Kejriwal: కేజ్రీవాల్‌కు దొరకని ఉపశమనం.. రేపు జైల్లో సరెండర్

అయితే, ఢిల్లీ సీఎం తీవ్ర అనారోగ్య కారణాలతో బాధపడుతున్నానని చెప్పడంతో, బీజేపీ సీనియర్ నేత విజయ్ గోయల్ శనివారం అంబులెన్స్ పంపించడం చర్చనీయాంశంగా మారింది. సివిల్ లైన్స్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్తున్న అంబులెన్స్‌ని, గోయల్‌ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ అంబులెన్స్ కేజ్రీవాల్ ఏదైనా ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు తీసుకువచ్చానని, అక్కడ అతడికి అన్ని పరీక్షలు కేవలం రెండు గంటలలోపు చేయబడతాయని గోయల్ విలేకరులతో అన్నారు. సీఎం కేజ్రీవాల్ తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందితే, నాటకాలు ఆపి తనతో పరీక్షలకు రావాలని కేంద్ర మాజీ మంత్రి అన్నారు. ప్రజల సానుభూతి పొందేందుకు కేజ్రీవాల్ ఆరోగ్య సమస్యలను చూపుతూ ‘డ్రామా’ సృష్టిస్తున్నారని గోయల్ ఆరోపించారు.

దీనికి ముందు ఆప్ నేత, ఢిల్లీ మంత్రి అతిషీ మాట్లాడుతూ.. కేజ్రీవాల్ కీటోన్ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయని, ఇది మూత్రపిండాల సమస్యలు లేదా క్యాన్సర్ లక్షణం కావచ్చని వైద్యులు చెప్పారని వెల్లడించారు. మే 10న సుప్రీంకోర్టు ఎన్నికల ప్రచారం నిర్వహించుకునేందుకు కేజ్రీవాల్‌కి 21 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఏడు దశల పోలింగ్ జూన్ 1తో ముగుస్తుండటంతో, జూన్ 2న లొంగిపోవాలని ఆదేశించింది.

Show comments