మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ ఉదంత మరిచిపోక ముందే మరో ఎంపీ కాళీ మాత వివాదంలో చిక్కుకుంది. త్రుణమూల్ కాంగ్రెస్ ఎపీ మహువా మోయిత్రా, కాళీ మాతపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆమెను అరెస్ట్ చేయాలంటూ బెంగాల్ బీజేపీ నేతలు మమతా సర్కార్ ను డిమాండ్ చేస్తున్నారు. బెంగాల్ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో ఆమెపై కేసులు నమోదు చేశారు. 10 రోజుల్లో పోలీసులు చర్యలు తీసుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తామని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.
మంగళవారం ఇండియా టుడే కాన్క్లేవ్ ఈస్ట 2022లో టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా కాళీ దేవిని మాంసాహరం, మద్యపానం స్వీకరించే దేవతగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దేశ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అవుతున్నాయి. హిందువులు చెడుకు వ్యతిరేకంగా కాళీ దేవతను పూపజిస్తారని.. ఆమె వ్యాఖ్యల వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని.. బీజేపీ బెంగాల్ అధ్యక్షుడు సుకాంత మజుందార్ అన్నారు. నుపుర్ శర్మపై చర్యలు తీసుకోవడానికి బెంగాల్ పోలీసులు బాగా ఆసక్తి చూపిస్తున్నారని..ఇదే విధంగా టీఎంసీ ఎంపీపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: Kollywood: హీరో విశాల్, కార్తీలను చంపుతామని బెదిరింపులు..!
తాజాగా మహువా మోయిత్రాపై మధ్యప్రదేశ్ భోపాల్ లో ఐపీసీ సెక్షన్ 295 ఏ కేసు నమోదు అయింది. ఎంపీ ప్రకటనలో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని.. హిందు దేవతలను అవమానించడాన్ని సహించేది లేదని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. అయితే తను కాళీ ఆరాధకురాలిని అని, బీజేపీకి భయపడేది లేదని మహువా మోయిత్రా ట్వీట్ చేశారు. త్రుణమూల్ ఎంపీ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం అని ఆ వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని త్రుణమూల్ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.
