NTV Telugu Site icon

Congress: “కాశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్”.. కాంగ్రెస్ తీరుపై బీజేపీ ఫైర్..

Kashmir Map

Kashmir Map

Congress: కాంగ్రెస్ మరో వివాదంలో ఇరుక్కుంది. ఇప్పటికే పార్లమెంట్ సమావేశాల్లో జార్జ్ సోరోస్‌తో సంబంధాలు, రాహుల్ గాంధీ ఎంపీలను తోసివేయడం వంటి అంశాలపై బీజేపీ ఆ పార్టీని కార్నర్ చేసింది. తాజాగా కాంగ్రెస్ ‘‘భారతదేశ మ్యాపు’’ని వక్రీకరించడం వివాదాస్పదంగా మారింది. జమ్మూ కాశ్మీర్ లేకుండా భారతదేశ మ్యాపుని పోస్టర్లుగా వేయడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

కర్ణాటక బెలగావిలో కాంగ్రెస్ అత్యున్నత సమావేశం సీడబ్ల్యూసీ మీటింగ్ జరుగుతోంది. మహాత్మా గాంధీ ఏఐసీసీ సమావేశానికి అధ్యక్షత వహించి శతాబ్ది గడవడంతో కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దీనికోసం కాంగ్రెస్ పోస్టర్లను, బ్యానర్లను ప్రదర్శించింది. వీటిలో జమ్మూ కాశ్మీర్ పూర్తిగా లేని భారతదేశ మ్యాపుని ఉంచారు. ఇప్పుడు ఇది వివాదంగా మారింది.

Read Also: Temple-Mosque disputes: మోహన్ భగవత్ వ్యాఖ్యలతో విభేదించిన ఆర్ఎస్ఎస్ పత్రిక..

బీజేపీ కర్ణాటక రాష్ట్ర విభాగం ఎక్స్ వేదికగా విమర్శలు చేసింది. ‘‘కాశ్మీర్‌ను పాకిస్తాన్‌లో భాగంగా చిత్రీకరించడం ద్వారా భారతదేశ సార్వభౌమాధికారాన్ని పూర్తిగా అగౌరవపరుస్తుంది’’ అని నిందించింది. ఇదంతా కేవలం తమ ఓటు బ్యాంకుని సంతోషపెట్టడానికే అని, ఇది సిగ్గుచేటని బీజేపీ పోస్ట్ చేసింది. బీజేపీ సీనియర్ నేత షెహజాద్ పూనావాలా ఈ వివాదంపై స్పందిస్తూ.. ఇది ‘‘భారత్ టోడో, తుక్డే-తుక్డే’’ ఆలోచనల్ని నొక్కి చెబుతోందని అన్నారు.

‘‘రాహుల్ గాంధీ కాశ్మీర్ పాకిస్తాన్‌లో భాగం కావాలనుకునే ఇల్హాన్ ఒమర్‌తో సమావేశమవుతారు. సోనియా గాంధీ కాశ్మీర్ పాకిస్తాన్‌కి ఇవ్వాలనే సంస్థకు సహ అధ్యక్షురాలు’’ అని పూనావాలా అన్నారు. ఇటీవల జార్జ్ సోరోస్ స్థాపించిన OCCRP లేదా ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ లింకులపై బీజేపీ కాంగ్రెస్‌ని విమర్శించింది. పాక్ పాటలు పాడటం, పాకిస్తాన్‌కి జమ్మూ కాశ్మీర్‌ని అప్పగించడం కాంగ్రెస్ ఎజెండాగా ఉందని పూనావాలా దుయ్యబట్టారు. మరో బీజేపీ నేత అమిత్ మాల్వియా స్పందిస్తూ.. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాల్లో భాగం, ఇది భారత ముస్లింలు పాకిస్తాన్‌కి మరింత విధేయులుగా ఉన్నారని సూచిస్తోందని, కాంగ్రెస్ కొత్త ముస్లింలీగ్ అని విమర్శించారు.

Show comments