NTV Telugu Site icon

Maharashtra: కేంద్ర పరిశీలకులుగా నిరలమ్మ, విజయ్ రూపానీ! షిండే కుమారుడికి కీలక పదవి?

Maharashtra

Maharashtra

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతలు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రుపానీకి కేంద్రం బాధత్యలు అప్పగించింది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చి 9 రోజులైంది. కానీ కొత్త ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఏర్పడ లేదు. మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. బీజేపీ 132 సీట్లు సాధించింది. దీంతో ముఖ్యమంత్రి పీఠం తమకే కావాలని కమలనాథులు పట్టుబడుతున్నారు. కానీ బీహార్ ఫార్ములా ప్రకారం తమకే సీఎం పదవి ఇవ్వాలంటూ శివసేన అడుగుతోంది. ఇలా ఇరుపక్షాల గజిబిజితో హైకమాండ్ కూడా ఏం తేల్చలేకపోతుంది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక కోసం కేంద్ర పరిశీలకులుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీని కేంద్రం ఏర్పాటు చేసింది. మరోవైపు డిసెంబర్ 5న కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని బీజేపీ ఇప్పటికే ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో సీఎం అభ్యర్థిని కేంద్ర పరిశీలకులు ప్రకటించే ఛాన్సుంది.

ఇదిలా ఉంటే బీజేపీ అభ్యర్థే ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఉంది. బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పడే ప్రభుత్వంలో ఏక్‌నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండేకు కీలక పదవి అప్పగించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీకాంత్ షిండేకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. ఈ మేరకు శివసేనను పరిశీలకులు ఒప్పించే అవకాశం ఉంది. మొత్తానికి మరికొన్ని గంటల్లో ఈ మహా సమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై శ్రీకాంత్ షిండే స్పందించారు. అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు. ఎలాంటి పదవిని ఆశించడం లేదని.. లోక్‌సభ ఎన్నికల సమయంలోనే కేంద్ర మంత్రి పదవి ఇస్తామని చెప్పారని.. అందుకు నో చెప్పినట్లు గుర్తుచేశారు. తాజాగా మరోసారి డిప్యూటీ సీఎం పదవిపై జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు.

మరోవైపు మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైనట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి. ఆయన పేరును అధికారికంగా ప్రకటించే ఛాన్సుందని సమాచారం. కానీ షిండే ఆరోగ్యం బాగోలేనందున మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దేవేంద్ర ఫడ్నవీస్ 2014 నుంచి 2019 వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2019 అక్టోబర్‌లో రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే.. కేవలం మూడు రోజులు మాత్రం సీఎంగా పని చేశారు. అనంతరం ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక 2022 నుంచి మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా వ్యవహరించారు. మరోసారి బీజేపీ అత్యధిక సీట్లు సంపాదించిన కారణాన దేవేంద్ర ఫడ్నవిస్‌కి ముఖ్యమంత్రి పీఠం దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బీజేపీ-132, షిండే శివసేన-57, ఎన్సీపీ-41, ఉద్ధవ్ థాక్రే-20, కాంగ్రెస్-16, శరద్ పవార్-10 సీట్లు సాధించాయి. అయితే షిండే వర్గం.. మహారాష్ట్రలో కూడా బీహార్ ఫార్ములా అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. బీహార్‌లో నితీష్ కుమార్‌కు సీట్లు లేకపోయినా.. ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాదే సూత్రం.. మహారాష్ట్రలో కూడా అమలు చేయాలని పట్టుబడుతోంది. అసలేం జరుగుతుందో తెలియక మహారాష్ట్ర ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.