Nitish Setu Controversy: బీహార్లో కొత్తగా ప్రారంభమైన ‘నితీశ్ సేతు’ ఇప్పుడు రాజకీయ వివాదానికి కేంద్రంగా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ వంతెనను ప్రారంభించిన కొద్దిసేపటికే అక్కడ రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆర్జేడీ (RJD) మద్దతుదారులు వంతెనపై ఏర్పాటు చేసిన పోస్టర్లను చించివేస్తూ హంగామా సృష్టించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం బీహార్ పర్యటనలో భాగంగా ‘నితీశ్ సేతు’ను ప్రారంభించారు. ఈ వంతెన రాఘోపూర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని కూడా కలుపుతుంది. ఈ ప్రాంతం ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడం గమనార్హం. ప్రధాని మోడీ ప్రారంభోత్సవ కార్యక్రమం ముగించుకుని వెళ్లిపోయిన తర్వాత స్థానిక ఆర్జేడీ మద్దతుదారులు వంతెనపై ఏర్పాటు చేసిన మోడీ పోస్టర్లను చించివేసినట్లు సమాచారం. ‘తేజస్వీ యాదవ్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేస్తూ కొందరు యువకులు పోస్టర్లను తొలగించారు. ఈ ఘటనను వారే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
కచ్చీ దర్గా-బిదుపూర్ వంతెనకు ‘నితీశ్ సేతు’ అని పేరు పెట్టినప్పటి నుంచి బీహార్లో రాజకీయ వివాదం కొనసాగుతోంది. ఈ వంతెనకు దివంగత అక్షయవత్ రాయ్ పేరు పెట్టాలని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ గతంలో డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఈ వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. గురుగోవింద్ సింగ్ పేరు మీద వంతెనకు పేరు పెట్టే విషయాన్ని ప్రభుత్వం గతంలో ప్రస్తావించిందని, ఆ నిర్ణయాన్ని ఎందుకు మార్చిందని కూడా తేజస్వీ యాదవ్ ప్రశ్నించారు. మరోవైపు, ఈ వంతెన నిర్మాణం తమ హయాంలో సాధించిన విజయమని ఆర్జేడీ నేతలు చెబుతున్నారు.
ఇటీవల కేంద్ర మంత్రి లలన్ సింగ్ కూడా ఈ వంతెన నిర్మాణానికి సంబంధించిన ఘనతపై ఆర్జేడీ చేస్తున్న వాదనలను తప్పుబట్టారు. ఆదివారం జరిగిన సభలో ఆయన ఈ అంశంపై మాట్లాడారు. జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ సైతం ఈ వంతెన నిర్మాణంలో ఆర్జేడీకి గానీ, బీజేపీకి గానీ ప్రత్యేకంగా ఎలాంటి పాత్ర లేదని వ్యాఖ్యానించారు. నితీశ్ కుమార్ చేసిన ప్రయత్నాల ఫలితంగానే ఈ వంతెన నిర్మాణం సాధ్యమైందని పేర్కొన్నారు.

