BJP criticizes CM Nitish Kumar and RJD alliance: లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీతో, సీఎం నితీష్ కుమార్ పార్టీ జేడీయూ పొత్తు పెట్టుకుని మరోసారి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బుధవారం ఎనిమిదో సారి సీఎంగా నితీష్ కుమార్ పదవీ స్వీకారం చేశారు. లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎంగా పదవిని చేపట్టారు. ఇన్నాళ్లు జేడీయూతో పాటు అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిపక్ష పార్టీగా మారింది. అయితే బీజేపీతో పొత్తును తెంచుకున్న కొన్ని గంటల్లోనే బీహార్ రాష్ట్రంలో నేరాలు పెరిగాయని బీజేపీ ఆరోపిస్తోంది. బీహార్ లో మరోసారి గుండా రాజ్ వచ్చిందంటూ విమర్శలు గుప్పిస్తోంది. మహాఘటబంధన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో నేరాలు పెరిగాయని.. గత రెండు రోజులుగా జరిగిన నేరాల జాబితాను విడుదల చేసింది బీజేపీ పార్టీ. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ నేరాల జాబితాను విడుదల చేశారు.
Read Also: KL Rahul: కేఎల్ రాహుల్ వచ్చేశాడు.. ధావన్‌కు ఎసరు పెట్టేశాడు
నేరాలు పెరగడానికే ఆర్జేడీతో పొత్తు పెట్టుకున్నారా..? అంటూ నితీష్ కుమార్ ను ప్రశ్నించారు. అత్యాచారం, దోపిడీలు, నేరాలు పెరిగేందుకే నితీష్ కుమార్ ఆర్జేడీతో కలిసి వెళ్లారా..? అని ట్వీట్ చేశారు నిత్యానందరాయ్. అందుకు తగ్గట్లుగానే గత రెండు రోజుల్లో బీహార్ లో పలు కీలక సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. నితీష్ కుమార్ రాజీనామా చేసిన రోజున పాట్నాలోని టయోటా షోరూమ్ లో భారీ దోపిడి జరిగింది. రూ. 9 లక్షలను దోచుకున్నారు. సెక్యురిటీ గార్డును కత్తితో పొడిచారు దుండగులు. నితీష్ ప్రమాణానికి కొద్ది గంటల ముందు స్థానిక వార్తాపత్రిక జర్నలిస్టును జాముయులో దుండగులు కిరాతకంగా హత్య చేశారు.
పశ్చిమ చంపారన్ జిల్లా నార్కటియాగంజ్ లో 12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ముజఫర్ నగర్ లోని నలిన్ రంజన్ అనే ఓ వ్యాపారవేత్త ఇంట్లో పగటిపూటనే దోపిడి జరిగింది. ఇదే పాట్నాలోని ఫతుహా, బార్హ్ లో హత్య, దోపిడి, అత్యాచారం వంటి అనేక ఘటనను బీజేపీ నేతలు ప్రస్తావించారు. నితీష్ కుమార్ ఆర్జేడీతో కలిసిన తరువాత క్రైం గ్రాఫ్ పెరిగిపోయిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీహర్ మరోసారి భయం నీడలో బతకాల్సివస్తోందని ఆరోపించారు.
