Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!

  • రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్
  • ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
  • గ్రామంలో చర్చనీయాంశం
Plumber

Plumber

డిజిటల్ బ్యాంకింగ్ యుగంలో ఆశ్చర్యానికి గురిచేసే ఘటన ఒకటి బీహార్‌లో వెలుగులోకి వచ్చింది. గయా జిల్లాలోని బోధ్‌గయా బ్లాక్ పరిధిలో ఉన్న మస్త్‌పురా గ్రామానికి చెందిన ఓ యువకుడి బ్యాంకు ఖాతాలో అకస్మాత్తుగా రూ.294.80 కోట్ల బ్యాలెన్స్ కనిపించడం స్థానికంగా సంచలనంగా మారింది.

ప్లంబర్ ఖాతాలో వందల కోట్లు

మస్త్‌పురా గ్రామానికి చెందిన వికాస్ కుమార్ వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్, ప్లంబర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు జియో పేమెంట్స్ బ్యాంక్‌లో సుమారు ఐదేళ్లుగా ఖాతా ఉంది. ఇటీవల జియో ఫైనాన్స్ యాప్ ద్వారా తన ఖాతా బ్యాలెన్స్‌ను పరిశీలించిన వికాస్, అందులో రూ.294.80 కోట్ల మొత్తం కనిపించడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. మొదట్లో ఇది యాప్‌లోని సాంకేతిక లోపమేమోనని భావించిన ఆయన, మరుసటి రోజు మళ్లీ బ్యాలెన్స్ చెక్ చేయగా అదే మొత్తం కనిపించింది.

×
×
Ad

బ్యాంకింగ్ లోపమా? సాంకేతిక సమస్యా?

వికాస్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, తన ఖాతాలో ఇప్పటివరకు జరిగిన అత్యధిక లావాదేవీలు రూ.6 నుంచి రూ.7 లక్షల మధ్య మాత్రమే ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో ఒక్కసారిగా వందల కోట్ల రూపాయలు ఖాతాలో కనిపించడం వికాస్ కుమార్ ను అయోమయానికి గురిచేసింది. ఏదైనా బ్యాంకింగ్ పొరపాటు లేదా సాంకేతిక లోపం ఉండొచ్చనే అనుమానంతో వికాస్ కుమార్ ఖాతా నుంచి డబ్బులు ఉపసంహరించుకునేందుకు లేదా ఎలాంటి లావాదేవీలు చేసేందుకు ప్రయత్నించలేదు.

గ్రామంలో చర్చనీయాంశం

ఈ విషయం గ్రామంలో తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. వికాస్ ఇంటికి గ్రామస్థులు, పరిసర ప్రాంతాల ప్రజలు చేరుకుని ఈ ఘటనపై ఆరా తీశారు. సోషల్ మీడియాలో కూడా ఈ వార్త వేగంగా వైరల్ అవుతోంది.

అసలు కారణంపై స్పష్టత లేదు

ప్రస్తుతం వికాస్ ఖాతాలో కనిపించిన రూ.294.80 కోట్లకు గల అసలు కారణం ఏమిటన్న దానిపై స్పష్టత లేదు. ఇది బ్యాంకింగ్ వ్యవస్థలో జరిగిన సాంకేతిక లోపమా, లేక మరేదైనా కారణమా అనే విషయంపై సంబంధిత అధికారులు లేదా బ్యాంకు నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ ఘటన మరోసారి డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థల్లో సాంకేతిక లోపాలపై చర్చకు తెరలేపింది.