NTV Telugu Site icon

Pappu Yadav: ఎంపీ పప్పూ యాదవ్‌కి “బిష్ణోయ్ గ్యాంగ్” బెదిరింపులు.. ఇక్కడే అసలు ట్విస్ట్..

Pappu Yadav

Pappu Yadav

Pappu Yadav: బీహార్ పూర్నియా ఎంపీ పప్పూ యాదవ్‌కి ఇటీవల గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయని ఆరోపించాడు. తనకు సెక్యూరిటీ పెంచాలని బీహార్ ప్రభుత్వంతో పాటు కేంద్రాన్ని కోరాడు. అయితే, ఈ కాల్స్ చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ఇతడు పప్పూ యాదవ్ మాజీ అనుచరుడని తేలింది. పప్పూ యాదవ్‌కి సెక్యూరిటీ పెంచే ఉద్దేశంతోనే బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడిగా నటిస్తూ కాల్స్ చేసినట్లు వెల్లడైంది. ప్రస్తుతం అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని రామ్ బాబు యాదవ్‌గా తేల్చారు. ఇతను వీడియో కాల్ చేసి, లారెన్స్ బిష్ణోయ్‌కి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Read Also: Sukhbir Singh Badal: మాజీ డిప్యూటీ సీఎం బాదల్‌పై హత్యాయత్నం.. నిందితుడికి ఖలిస్తాన్ ఉగ్ర లింకులు..

రాబ్ బాబు యాదవ్‌ని మంగళవారం భోజ్‌పూర్ జిల్లాలోని అతడి స్వగ్రామం నుంచి అరెస్ట్ చేశారు. లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో విలీనమైన పప్పూ యాదవ్ పార్టీ జన్ అధికార్ పార్టీ (జేఏపీ)తో సంబంధం కలిగి ఉన్నాడని పూర్నియా ఎస్పీ కార్తికేయ కె శర్మ మంగళవారం తెలిపారు. పప్పూ యాదవ్ పూర్నియా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు.

పోలీసులు రామ్ బాబు యాదవ్ లొకేషన్ ట్రాక్ చేసి అరెస్ట్ చేశారు. ప్రాథమిక దర్యాప్తులో నిందితుడికి ఏ ముఠాతో సంబంధాలు లేవని, కొందరి సూచనల మేరకే ఎంపీకి బెదిరింపు సందేశాలు పంపినట్లు అతను అంగీకరించాడు. ఎంపీకి ఇలా వీడియో పంపినందుకు రూ. 2000 చెల్లించినట్లు అరెస్టయిన వ్యక్తి పేర్కొన్నాడు. ముంబైలో మాజీ శాసనసభ్యుడు బాబా సిద్ధిక్ హత్య తర్వాత బిష్ణోయ్ గ్యాంగ్‌ను అంతమొందించాలని తాను భావిస్తున్నట్లు ప్రకటించినప్పటి నుండి పప్పు యాదవ్‌కు హత్య బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించారు.