Bihar: దారుణం.. పెళ్లి చేసుకోమన్నందుకు ప్రేయసిని బైక్‌పై ఈడ్చుకెళ్లిన ప్రియుడు

  • బీహార్‌లో దారుణం
  • పెళ్లి చేసుకోమన్నందుకు ప్రేయసిని బైక్‌పై ఈడ్చుకెళ్లిన ప్రియుడు
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
Bihar

Bihar

బీహార్‌లోని నలందా జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లి చేసుకోమన్న పాపానికి ఓ ప్రియుడి అమానుషంగా ప్రవర్తించాడు. బైక్‌పై 100 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లిపోయాడు. ఈ దారుణ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

వీడియోలో యువతి బైక్‌ను పట్టుకుని సహాయం కోసం అరుస్తుండగా.. యువకుడు బైక్ ఆపకుండా వేగంగా ముందుకు వెళ్లడం కనిపిస్తోంది. దీంతో యువతి రోడ్డుపై లాగబడుతూ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ దృశ్యాలను చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. స్థానికుల సమాచారం ప్రకారం.. యువకుడు బైక్ వేగంగా నడుపుతుండగా అది అదుపుతప్పి కిందపడింది. అనంతరం అక్కడికి చేరుకున్న స్థానికులు యువకుడిని చుట్టుముట్టి నిలదీశారు. కొందరు అతనిపై దాడి చేశారు. అయితే యువకుడు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆ యువతి తన భార్య అని చెప్పి, ఇది కుటుంబ వివాదమని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో మరింతగా దాడి జరగకుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడని పోలీసులు తెలిపారు.

ఐదేళ్ల ప్రేమ.. పెళ్లి విషయంలో గొడవ

దర్యాప్తులో భాగంగా పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇద్దరూ దాదాపు ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నారు. నిందితుడు నవాడా జిల్లాలోని నర్దిగంజ్ ప్రాంతంలో అమీన్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం అతను రాజగిర్‌కు వచ్చి యువతిని కలిశాడు. ఈ సందర్భంగా యువతి పెళ్లి విషయాన్ని ప్రస్తావించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో యువకుడు బైక్‌పై అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించాడు. యువతి ఆపేందుకు బైక్‌ను పట్టుకోగా.. ఆపాల్సిన బదులు అతను బైక్‌ను మరింత వేగంగా నడిపాడని, దీంతో ఆమె దాదాపు 100 మీటర్ల వరకు రోడ్డుపై లాగబడినట్లు వైరల్ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందని పోలీసులు తెలిపారు.

రాజగిర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ అభిజిత్ కుమార్ మాట్లాడుతూ.. ఈ ఘటన పెళ్లి వివాదానికి సంబంధించినదని, నిందితుడు ప్రభుత్వ ఉద్యోగి అని ధృవీకరించారు. బాధిత యువతి నవాడా జిల్లాలోని నర్దిగంజ్ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వక ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, వైరల్ వీడియో ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.