Bihar SIR: వివాదాస్పదమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తర్వాత, బీహార్ తుది ఓటర్ జాబితా మంగళవారం రిలీజ్ అయింది. భారత ఎన్నికల కమిషన్(ECI) బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు తుది ఓటర్ల జాబితాను ప్రచురించింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ ఓటర్ జాబితా ఆధారంగా నిర్వహించబడుతాయి. 22 ఏళ్ల తర్వాత ఈసీ బీహార్ లో నకిలీ ఓటర్ల తొలగింపును చేపట్టింది. అయితే, ఈసీ చేపట్టిన ఈ చర్యల్ని కాంగ్రెస్, ఆర్జేడీ సహా అన్ని ప్రతిపక్షాలు విమర్శించాయి. బీజేపీకి అనుకూలంగా ఈసీ పనిచేస్తోందని ఆరోపించాయి.
బీహార్ ఎన్నికల కోసం అక్టోబర్ 6-7 మధ్య షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. దీనికి ముందు ఈసీ ఆగస్టు 1న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించింది. సెప్టెంబర్ 1 వరకు వాదనలు, అభ్యంతరాలనున స్వీకరించింది. సర్ ప్రక్రియ ముందు వరకు బీహార్‌లో 7.89 కోట్ల మంది ఓటర్లు ఉండేవారు. అయితే, ప్రక్రియ తర్వాత ఓటర్ల సంఖ్య 7.24 కోట్లు ఉన్నట్లు తేలింది. 65.63 లక్షల మంది పేర్లు ఓటర్ జాబితా నుంచి తొలగించబడ్డాయి.
సర్ ప్రక్రియ ప్రతిపక్షాలకు టార్గెట్‌గా మారింది. రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ముస్లింలను టార్గెట్ చేస్తూ ఈసీ ఈ ప్రక్రియను చేపట్టిందని ఆరోపించారు. ఈసీ, బీజేపీలు కలిసి కుట్ర చేస్తున్నట్లు విమర్శించారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌తో కలిసి రాహుల్ గాంధీ బీహార్లో ‘‘ఓటర్ అధికార్ యాత్ర’’ నిర్వహించారు. సర్ ని ఓటు దొంగతంగా పిలిచారు. ఈ విషయం సుప్రీంకోర్టుకు కూడా చేరింది. ఈసీ నిర్వహించిన ప్రక్రియలో అవకతవకలు జరిగితే ఓటర్ల జాబితాను రద్దు చేయడానికి కూడా వెనకాడబోమని సుప్రీంకోర్టు హెచ్చరించింది.
ప్రస్తుత బీహార్ అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 22తో ముగుస్తుంది. తుది ఓటర్ల జాబితా విడుదల కావడం, ఈసీ బీహార్ ఎన్నికల నిర్వహణపై సమీక్షిస్తున్నందున, అక్టోబర్ 6 లేదా 7 నాటికి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించవచ్చని వర్గాలు సూచిస్తున్నాయి.
