Bihar Election Results: బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. జేడీయూ, బీజేపీల తుఫానులో ఆర్జేడీ, కాంగ్రెస్‌లు కొట్టుకుపోయాయి. 243 స్థానాలు ఉన్న బీహార్‌లో, ఏకంగా 185 నుంచి 190 స్థానాలు సాధించే దిశగా ఎన్డీయే వెళ్తోంది. ఇక ప్రతిపక్ష మహాఘట్బంధన్ కూటమి 50 లోపు స్థానాలకు మాత్రమే పరిమితమవుతోంది. ఈసారి కూడా ఆర్జేడీ కూటమికి చేదు ఫలితాలు ఎదురయ్యాయి.
ఈ ఎన్నికల్లో సీఎం నితీష్ కుమార్, ప్రధాని నరేంద్రమోడీల ‘‘నిమో’’ జోడీ సూపర్ హిట్ అయింది. రెండు పార్టీలు కూడా వ్యతిరేతకను అధిగమించాయి. మరోవైపు, ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమిలో పొత్తుల ముందు నుంచే లుకలుకలు ఏర్పడ్డాయి. ఎన్డీయే కూటమిలో ముందు నుంచి అన్ని పార్టీలు సయోధ్యతో సీట్ల ఒప్పందాన్ని కదుర్చుకున్నాయి. ప్రచారాన్ని ఎలాంటి విభేదాలు లేకుండా నిర్వహించాయి. ఇది కూడా ఎన్డీయే కూటమి విజయానికి దోహదపడింది. ఇక మోడీ ఫ్యాక్టర్, నితీష్ కుమార్‌లకు ఉన్న క్లీన్ ఇమేజ్ ప్రజల ఓట్లను కొల్లగొట్టడానికి కారణమైంది. ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రచారం కలిసి వచ్చింది. తేజస్వీ యాదవ్, నితీష్ కుమార్ వయసు గురించి కించపరిచేలా విమర్శలు చేయడం కూడా ఆర్జేడీకి ప్రతికూలంగా, జేడీయూకు సింపతీగా మారాయి.
Read Also: Bihar Election Results: బీహార్‌లో ‘‘SIR’’ గెలిచింది, ప్రజాస్వామ్య హత్య.. కాంగ్రెస్ ఆరోపణలు మొదలు..
బీజేపీకి సహజంగా పట్టణాల్లో ఉండే ఓట్ బ్యాంక్, జేడీయూకు గ్రామాల్లో ఉండే సంస్థాగత నిర్మాణం, ఈ రెండు కలిసి అఖండ విజయాన్ని సాధించిపెట్టాయి. దీంతో పాటు కుల సమీకరణాలు, మహిళల ఓట్లు ఎన్డీయే కూటమికి కలిసి వచ్చాయి. ముఖ్యంగా, లాలూ ప్రసాద్ సమయంలోని ‘‘జంగిల్ రాజ్’’ పాలనను ఇంకా బీహార్ ప్రజలు మరిచిపోలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఇది ఈ ఎన్నికల్లో ప్రతిబింబించింది. నితీష్ కుమార్ పాలనలో లా అండ్ ఆర్డర్ పరిస్థితుల్ని, జంగిల్ రాజ్‌తో ప్రజలు బేరీజు వేసుకుని ఓట్లు వేశారు.
కుల, మత సమీకరణాలు పరిశీలిస్తే.. ముఖ్యంగా యాదవులు, ముస్లింలు ఆర్జేడీ కూటమికి ఓటు వేసినట్లు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే ఫలితాలను చూస్తే యాదవులు కూడా అంత ప్రభావవంతంగా ఆర్జేడీకి ఓటు వేయలేదని తెలుస్తోంది. యాదవేతర, ముస్లిమేతర ఓటర్లు మొత్తం గంపగుత్తగా ఎన్డీయే కూటమి వైపు నిలిచారు. ఓబీసీలు, ఈబీసీలు, అగ్ర కులాలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు మోడీ-నితీష్ జోడీకి మద్దతు ఇచ్చారు. ఇవన్నీ కలిసి బీహార్‌లో ఎన్డీయే ఘన విజయానికి కారణమయ్యాయి.
