బీహార్ విద్యాశాఖలో వింతైన సంఘటన వెలుగు చూసింది. ఒక మగ ఉపాధ్యాయుడికి మెటర్నిటీ లీవ్ మంజూరు కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
బీహార్ విద్యాశాఖలో సెలవులు కోసం ఆన్‌లైన్ దరఖాస్తు విధానం ఉంది. సెలవుల కోసం ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్లై చేసుకుంటారు. అయితే ఒక మగ టీచర్‌కు మెటర్నిటీ సెలవులు మంజూరు అయ్యాయి. వారం రోజులుగా ఉపాధ్యాయుడు ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఒక పురుష ఉపాధ్యాయుడికి ప్రసూతి సెలవులు ఎలా మంజూరు చేస్తారంటూ ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి కీలక ప్రకటన..
విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో తప్పు ఒప్పుకున్నారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ పొరపాటు జరిగిందని.. ఆన్‌లైన్ పోర్టర్‌ను సరి చేస్తామని ఇన్‌ఛార్జ్ విద్యా అధికారి అర్చన కుమారి తెలిపారు. దరఖాస్తు ఫార్మాట్‌లో లోపం కారణంగానే ఉపాధ్యాయుడు జితేంద్ర కుమార్ సింగ్‌కు ప్రసూతి సెలవు మంజూరు అయిందని పేర్కొంది. లోపాన్ని సరిదిద్దుతామని వెల్లడించారు. ప్రసూతి సెలవులు కేవలం మహిళలకు మాత్రమే వర్తిస్తాయని.. అయితే పురుషులు కూడా తమ నవజాత శిశువులను చూసుకోవడానికి ‘పితృత్వ అవకాష్’ (ప్రసూతి సెలవు) పొందవచ్చని చెప్పుకొచ్చారు. అయినా తమ దృష్టికి వచ్చిన ఈ లోపాన్ని సరిదిద్దుతామని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలైన కామెంట్లు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: UDAN Yatri Cafe: ఎయిర్‌పోర్టులో రూ.10కి టీ, రూ. 20కి సమోసా.. ఎలా సాధ్యమైందంటే..