Site icon NTV Telugu

Singer Maithili Thakur: మోడీచే ప్రశంసలు.. ఇప్పుడు బీహార్ బీజేపీ మంతనాలు.. మైథిలి ఠాకూర్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమా?

Singer Maithili Thakur2

Singer Maithili Thakur2

ప్రముఖ జానపద గాయని మైథిలి ఠాకూర్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అవుననే సమాధానం వస్తుంది. బీహార్ రాష్ట్రానికి చెందిన మైథిలి ఠాకూర్.. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు బీజేపీ నేతల సమావేశాలే ఉదాహరణగా ఉన్నాయి.

ఢిల్లీలో మైథిలి ఠాకూర్‌ను బీహార్ బీజేపీ ఇన్‌ఛార్జ్ వినోద్ తవ్డే, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్‌ కలిశారు. ఈ సందర్భంగా మైథిలి, ఆమె తండ్రితో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై చర్చించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇందుకు సంబంధించిన ఫొటోలను వినోద్ తవ్డే తన ఎక్స్‌లో పోస్టు చేశారు. మైథిలి ‘బీహార్ కుమార్తె’ అని సంబోధించారు. అంతేకాకుండా రాష్ట్రానికి రావాలని స్వాగతించారు. దీంతో మైథిలి ఠాకూర్‌ పొలిటికల్ ఎంట్రీపై విస్తృతంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక మైథిలి ఠాకూర్ ప్రతిభను ప్రధాని మోడీ కూడా ప్రశంసించారు. మైథిలికి బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయి. పైగా మైథిలిది బీహార్‌లోని మధుబని నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మైథిలి ఫ్యామిలీకి మంచి పేరు ఉంది. ఈ నేపథ్యంలో మధుబని లేదా అలీఘర్ నియోజకవర్గం నుంచైనా పోటీ చేయాలని బీజేపీ నేతలు చర్చించినట్లు వర్గాలు పేర్కొంటున్నాయి.

1995లో లాలూ ప్రసాద్ యాదవ్ అధికారంలో ఉన్నప్పుడు మైథిలి ఠాకూర్ కుటుంబం ఢిల్లీకి మకాం మార్చింది. ప్రస్తుతం మైథిలి ప్రముఖ గాయని. సోషల్ మీడియాలో మంచి గుర్తింపు సంపాదించింది. దీంతో ఆమె తిరిగి బీహార్ రావాలని ప్లాన్ చేస్తోంది.

మాత శబరిపై మైథిలి ఠాకూర్ ఒక పాట పాడినందుకు జనవరి 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు. అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మైథిలి పాటలో ఒకదాన్ని పంచుకుంటూ ఇలా రాశారు. ‘‘అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ సందర్భం దేశవ్యాప్తంగా ఉన్న నా కుటుంబ సభ్యులకు శ్రీరాముని జీవితం, ఆదర్శాలకు సంబంధించిన ప్రతి సంఘటనను గుర్తు చేస్తోంది. అలాంటి ఒక భావోద్వేగ సంఘటన శబరికి సంబంధించినది. మైథిలి ఠాకూర్ జీ దానిని తన శ్రావ్యమైన బాణీలలో ఎలా పొందుపరిచారో వినండి.’’ అని మోడీ పేర్కొన్నారు.

మైథిలి ఠాకూర్..
మైథిలి ఠాకూర్ 25 జూలై 2000లో జన్మించింది. రమేష్-భారతీ దంపతులకు జన్మించింది. భారతీయ శాస్త్రీయ సంగీత, జానపద సంగీతంలో శిక్షణ పొందింది. హిందీ, బెంగాలీ, ఉర్దూ, మరాఠీ, భోజ్పురి, పంజాబీ, తమిళం, ఇంగ్లీష్ సహా పలు భాషల్లో పాడింది. 2024లో మైథిలి ఠాకూర్‌కు ‘‘కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించింది.

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతల్లో జరగనున్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

 

Exit mobile version