Bihar: సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ సర్కార్ కీలక రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. బీహార్‌లోని ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల పెంపుదల కోరుతూ రూపొందించిన ‘రిజర్వేషన్ సవరణ బిల్లు’ను ఈరోజు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. రాష్ట్రంలోని ఇతర వెనకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కోటాను పెంచే బిల్లుకు మంగళవారం బీహార్ కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది.
ఈ రోజు సీఎం నితీష్ కుమార్ హాజరు కాకుండానే రాష్ట్ర అసెంబ్లీ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు రాష్ట్రంలో రిజర్వేషన్ల కోటాను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచుతుంది. ఆర్థికంగా వెనబడిన వర్గాల కోటా(ఈడబ్ల్యూఎస్) కోసం కేంద్రం 10 శాతం కోటాను కలుపుకుంటే మొత్తం రిజర్వేషన్లు 75 శాతానికి పెరుగుతాయి.
Read Also: 1000 years old treasure: బయటపడ్డ 1000 ఏళ్ల నాటి నిధి.. ఎక్కడో తెలుసా..?
ఈ బిల్లు ప్రకారం చూసుకుంటే.. ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 2 శాతం, ఓబీసీ, బీసీలకు కలిపి 43 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. ప్రస్తుతం బీహార్ రాష్ట్ర ఉద్యోగాల్లో, విద్యాసంస్థల్లో ఈబీసీలకు 18, ఓబీసీలకు 12 శాతం, ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు 1 శాతం, వెనకబడిన తరగతుల మహిళలకు 3 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. అయితే రిజర్వేషన్ల విభజన బిల్లులో ఈడబ్ల్యూఎస్‌ని ప్రస్తావించకపోవడంపై బీజేపీ విమర్శిస్తోంది.
కులాల సర్వేలో బీహార్ ప్రభుత్వం కావాలనే యాదవులు, ముస్లింల జనాభాను పెంచిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. అయితే బీజేపీ విమర్శలను సీఎం నితీష్ కుమార్ తిప్పికొట్టారు. తొమ్మిది పార్టీల మద్దతుతో కుల ప్రాతిపదికన జనాభా గణన జరిగింది, ప్రతీ ఒక్కరి ఆర్థిక పరిస్థితి పరిశీలించామని, ఈ విషయాన్ని ఇప్పటికే సభలో చెప్పాము, దీనిపై ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాంటూ బీజేపీని ప్రశ్నించారు. తక్షణమే ఈ బిల్లును అమలు చేయాలని ముఖ్యమంత్రి కోరారు.
