NTV Telugu Site icon

Swati Maliwal assault: స్వాతి మలివాల్ దాడి కేసు.. ఫోన్ ఫార్మాట్ చేసిన బిభవ్ కుమార్, సీసీటీవీ ట్యాంపరింగ్..

Swati Maliwal Assault

Swati Maliwal Assault

Swati Maliwal assault: ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన పీఏ బిభవ్ కుమార్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశం ఆప్ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది. దాడికి పాల్పడిన బిభవ్ కుమార్‌ని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఎయిమ్స్ నివేదికలో స్వాతిమలివాల్ కాలిపై, చెంపపై గాయాలు ఉన్నట్లుగా తేలింది. ఇదిలా ఉంటే, నిందితుడిగా ఆరోపించబడుతున్న బిభవ్ కుమార్ తన ఫోన్‌ని ఫార్మాట్ చేశాడని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అతను ఫోన్‌ని ఫార్మాట్ చేసి దర్యాప్తుకు సహకరించడం లేదని పోలీసులు తెలిపారు.

మే 13న సీఎం కేజ్రీవాల్ నివాసంలో తనపై దాడి చేశాడని స్వాతి మలివాల్ ఆరోపించడంతో ఎఫ్ఐఆర్ నమోదైంది. బిభవ్ కుమార్ కస్టడీ కోరుతూ తన రిమాండ్ రిపోర్టులో, అరెస్ట్ చేయడానికి ఒక రోజు ముందు అతను తన ఫోన్‌ని ముంబైలో ఫార్మాట్ చేశాడని పోలీసులు పేర్కొన్నారు. శనివారం బిభవ్ కుమార్ బెయిల్ కోసం అప్లై చేసినప్పటికీ కోర్టు దీనిని తోసిపుచ్చుతూ, 5 రోజుల పోలీస్ కస్టడీకి ఇచ్చింది. కొన్ని లోపాల కారణంగా తన మొబైల్ ఫోన్ ఫార్మాట్ చేసినట్లు అతను పోలీసులకు చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బిభవ్ కుమార్ ఫోన్ నుంచి డేటా పొందేందుకు పోలీసులు ఫోరెన్సిక్ నిపుణుల సాయాన్ని కోరే అవకాశం ఉంది.

Read Also: Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ భేటీకి సీఈసీ గ్రీన్ సిగ్నల్.. కానీ!

ఆదివారం కేజ్రీవాల్ నివాసం నుంచి దాడి జరిగిన ప్రదేశంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీ ఖాళీగా ఉన్నందున సాక్ష్యాలు తారుమారు చేసి ఉంటారని పోటీసులు అనుమానిస్తున్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కేజ్రీవాల్ నివాసం నుంచి ఆదివారం పోలీసులు సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే సీన్‌ రీకన్‌స్ట్రక్షన్ చేయడానికి బిభవ్ కుమార్‌ని ముఖ్యమంత్రి నివాసానికి తీసుకెళ్లే అవకాశం ఉంది.

స్వాతి మలివాల్‌పై దాడి జరగలేదని ఆప్ మంత్రి అతిషి మార్లెనా ఆరోపించారు. ఇదంతా బీజేపీ కుట్రగా అభివర్ణించారు. స్వాతి మలివాల్ అవినీతి కేసుల్లో ఇరుక్కోవడంతో బీజేపీ ఆమెను బ్లాక్‌మెయిల్ చేస్తోందని అన్నారు. మరోవైపు ఈ అంశం బీజేపీ వర్సెస్ ఆప్‌గా మారింది. స్వాతి మలివాల్‌పై దాడి గురించి కేజ్రీవాల్ మౌనంగా ఉండటాన్ని బీజేపీ ప్రశ్నిస్తోంది.