గుజరాత్ సర్కార్‌లో వేగంగా పరిణామాలు మరిపోయాయి.. సీఎం పదవికి రాజీనామా చేసిన విజయ్ రూపానీ.. ఆ తర్వాత తదుపరి గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ పేరును ప్రతిపాదించారు.. ఇక, అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. మొత్తంగా గుజరాత్ 17వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు 59 ఏళ్ల భూపేంద్ర పటేల్.. ఇవాళ మధ్యాహ్నం గవర్నర్ ఆచార్య దేవ్ వరాత్.. భూపేంద్ర పటేల్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా, నిన్న సమావేశమైన బీజేపీ శాసనసభా పక్షం భూపేంద్రను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. దీంతో.. ఆయన సీఎం పగ్గాలు చేపట్టడం సులభమైంది.
మరోవైపు.. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తదితర నేతలు హాజరయ్యారు. ఇక, గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలుండగా.. అందులో 112 మంది బీజేపీ సభ్యులే.. ఇవాళ జరిగిన భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారోత్సవానికి వీరంతా హాజరయ్యారు. తొలిసారి 2017లో ఘట్లోడియా అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన భూపేంద్ర.. పార్టీలు, ప్రభుత్వంలో అంచలంచలుగా ఎదుగుతూ వచ్చారు.. 2015-2017 మధ్య అహ్మదాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా.. 2010-2015 మధ్య అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గానూ పనిచేశారు. కాగా, వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎంను మార్చేసింది బీజేపీ.. పటేల్ వర్గం ఓట్లను ఆకర్షించడంలో భాగంగానే భూపేంద్ర పటేల్‌ను సీఎంగా ఎంపిక చేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట.