మూడోసారి బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మమతా బెనర్జీ.. కీలక ఎన్నిక ఎదుర్కోబోతున్నారు. నందిగ్రామ్‌లో బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో ఓడినప్పటికీ.. మమతా బెనర్జీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆరునెలల్లోగా ఆమె ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. ఇందుకోసం భవానీపూర్ నియోజకవర్గంలో గెలిచిన వ్యవసాయ మంత్రి శోబన్‌దేవ్ ఛటోపాధ్యాయ రాజీనామా చేశారు. ఆ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికలో మమత పోటీ చేస్తున్నారు. 2011, 2016 ఎన్నికల్లో కూడా మమత.. భవానీపూర్ నుంచే గెలిచి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఉపఎన్నికలో కూడా గెలిచి.. సీఎంగా కొనసాగాలనుకుంటున్నారు.
ఇటు దేశవ్యాప్తంగా బీజేపీయేతర శక్తుల్ని కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్న మమతకు.. బెంగాల్లోనే చెక్ పెట్టాలని కమలనాధులు వ్యూహాలు రచించారు. భవానీపూర్‌లో ప్రియాంక తిబ్రేవాల్‌ను బరిలో దింపారు. ప్రచారానికి చివరి రోజు కూడా టీఎంసీ, బీజేపీ మధ్య ఘర్షణలు జరిగాయి. దీంతో ఎన్నికల సమయంలో ఉద్రిక్తత చెలరేగే ప్రమాదం ఉండటంతో ఈసీ అప్రమత్తమైంది. భవానీపూర్‌లో పోలింగ్ ముగిసేవరకు 144 సెక్షన్ విధించింది. భారీగా 15 కంపెనీల కేంద్ర బలగాల్ని కూడా పోలింగ్ స్టేషన్ల వద్ద మోహరించింది ఈసీ.