Rajnath Singh: క్రికెట్‌లో బెస్ట్ ఫినిషర్ మహేంద్ర సింగ్ ధోని అయితే, భారత రాజకీయాల్లో ‘‘బెస్ట్ ఫినిషర్’’ రాహుల్ గాంధీ అని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సెటైర్లు వేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సిధి జిల్లాలో శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి అవినీతితో విడదీయరాని బంధం ఉందని రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. ఒకప్పుడు భారతదేశ రాజకీయాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం చెలాయించేదని, ఇప్పుడు రెండుమూడు చిన్న రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైందని అన్నారు.
‘‘ ఎందుకు ఇలా జరుగుతుందని కొన్నిసార్లు ఆశ్చర్యపోతున్నా. నేను ఒక నిర్ణయానికి వచ్చా.. క్రికెట్‌లో బెస్ట్ ఫినిషర్ ఎవరు.. ధోని, ఎవరైనా నన్ను భారత రాజకీయాల్లో బెస్ట్ ఫినిషర్ ఎవరు అని అడిగితే, నేను రాహుల్ గాంధీ అని చెబుతాను. చాలా మంది నేతలు కాంగ్రెస్‌ను వీడడానికి ఇదే కారణం’’ అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. కాంగ్రెస్‌ని ఖతం చేసే వరకు రాహుల్ గాంధీ విశ్రమించరని ఎద్దేవా చేశారు.
Read Also: MP Margani Bharat: కేంద్రమేమీ ఆకాశం నుండి ఊడి పడలేదు.. ఏపీకి తీరని అన్యాయమే చేసింది..
కాంగ్రెస్‌కి అవినీతికి అవినాభావ సంబంధం ఉందని, చాలా కాంగ్రెస్ ప్రభుత్వాలు అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నాయని, అయితే ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలోని ఏ మంత్రిపైనా అలాంటి ఆరోపణలు రాలేదని రాజ్‌నాథ్ అన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికలకు ఆయన మద్దతు పలికారు, ఇది సమయం, వనరులను ఆదా చేస్తుందని పేర్కొన్నారు. ఏక కాల ఎన్నికలకు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయని చెప్పారు. 2027 ప్రారంభం నాటికి భారతదేశం ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థగా మారుతుందని అంచనా వేశారు. పదేళ్ల క్రితం 11వ స్థానంలో ఉన్న భారత్, మోడీ పాలనలో 5వ స్థానానికి చేరుకుందని చెప్పారు. 2045 నాటికి భారత్ సూపర్ పవర్ అవుతుందని ఆయన అన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ చాలా హామీలు ఇచ్చిందని, వాటిని పాక్షికంగా అమలు చేసినా, భారత్ చాలా ఏళ్ల క్రితమే శక్తివంతమైన దేశంగా ఎదిగేదని అన్నారు. మరోవైపు పదేళ్లలో బీజేపీ తన వాగ్దానాలను నెరవేర్చిందని చెప్పారు. మేం చెప్పినట్లు రామమందిరం నిర్మించాం, ఆర్టికల్ 370 రద్దు చేశాం, త్రిపుల్ తలాక్‌కి స్వస్తి పలికామని ఉదాహరణగా చెప్పారు. బుజ్జగింపు రాజకీయాలు చేయడం లేదని, దేశ నిర్మాణం కోసం బీజేపీ రాజకీయాలు చేస్తుందని ఆయన అన్నారు.
