Bengaluru: బెంగళూర్ నగరంలో శివాజీనగర్ మెట్రో స్టేషన్ త్వరలో ప్రారంభానికి సిద్ధమైంది. మెట్రో స్టేషన్‌కు ‘‘సెయింట్ మేరీ’’ పేరు పెట్టాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఒత్తిడి చేస్తుండటం తీవ్ర దుమారానికి కారణమైంది. శివాజీ నగర్ మెట్రో స్టేషన్‌కు సెయింట్ మేరీ పేరు పెట్టడం ఏంటని?? బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరాఠా ఐకాన్‌ను ఇది అవమానించడమే అని ఆరోపించింది. ఇది శివాజీ మహారాజ్‌ని అవమానించడమే అని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.
శివాజీనగర్ లోని సెయింట్ మేరీస్ బసిలికాలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించిన సీఎం సిద్ధరామయ్య.. రాబోయే స్టేషన్‌కు సెయింట్ మేరీ పేరు పెట్టాలని కేంద్రానికి సిఫార్సు చేసినట్లు చెప్పారు. ఈ ప్రకటన మహారాష్ట్ర నాయకులతో పాటు కర్ణాటక బీజేపీ నాయకుల నుంచి తీవ్ర విమర్శలకు కారణమైంది.
Read Also: Insurance: షోరూంలో వాహనానికి యాక్సిడెంట్ అయితే, ఇన్సూరెన్స్ వస్తుందా..?
“బెంగళూరులోని శివాజీనగర్ మెట్రో స్టేషన్‌కు సెయింట్ మేరీ పేరు పెట్టాలని కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న చర్యను నేను ఖండిస్తున్నాను. ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను అవమానించడం. నెహ్రూ కాలం నుండి మరాఠా యోధుడిని అవమానించే సంప్రదాయాన్ని కాంగ్రెస్ కొనసాగిస్తోంది, ఆయన తన పుస్తకం ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’లో శివాజీ మహారాజ్‌పై నెహ్రూ వ్యాఖ్యలు చేశారు.” అని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ అన్నారు. దేవుడు సిద్ధరామయ్యకు అలాంటి నిర్ణయం తీసుకోకుండా బుద్ధి చెప్పాలని కోరారు.
బుజ్జగింపు రాజకీయాల కోసం కాంగ్రెస్ దిగజారి ప్రవర్తిస్తోందని బీజేపీ నేత చల్వాడి నారాయణ్ స్వామి అన్నారు. శివాజీ మహారాజ్ పట్ల కాంగ్రెస్ ద్వేషం బహిర్గతమైందని మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్సీ చిత్ర వాఘ్ అన్నారు. ‘‘ బెంగళూర్ శివాజీ నగర్ మెట్రో స్టేషన్‌కు సెయింట్ మేరీ స్టేషన్‌గా పేరు మార్చాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే రిజ్వాన్ డిమాండ్ చేశారు. సీఎం సిద్ధరామయ్య పేరు మార్పు కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. దీనిపై మహారాష్ట్ర కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేస్తుందా.. మౌనంగా ఉంటుందా..?’’ అని ప్రశ్నించారు.
