Bengaluru: నీట్ రీ ఎగ్జామ్‌కు హాజరుకాని ముగ్గురు అభ్యర్థులు.. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వాగ్యుద్ధం

  • బెంగళూరులో రీ-నీట్ పరీక్ష మిస్‌
  • బీజేపీ-కాంగ్రెస్ మధ్య రాజకీయ రగడ
  • ఒకరిపై ఒకరు నిందలు.. విమర్శలు
Bengalurureneet

Bengalurureneet

బెంగళూరులో జరిగిన నీట్ రీ-ఎగ్జామ్ మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. ఇప్పటికే ఒకసారి నీట్ పరీక్ష రద్దు కావడంతో దేశ వ్యాప్తంగా తీవ్ర అలజడి చెలరేగింది. తిరిగి కేంద్ర ప్రభుత్వం జూన్ 21 (ఆదివారం) నిర్వహించింది. అంతా సజావుగా సాగుతుందన్న తరుణంలో మరో రాజకీయ పంచాయితీ చెలరేగింది.

బెంగళూరులో నిర్వహించిన రీ-నీట్ పరీక్ష సందర్భంగా ముగ్గురు విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేకపోవడంతో కర్ణాటక రాజకీయాల్లో వివాదం చెలరేగింది. ఈ ఘటనపై బీజేపీ, కాంగ్రెస్ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ నిర్వహించిన భారీ ర్యాలీ కారణంగా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడి విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు ఆలస్యంగా చేరుకున్నారని బీజేపీ ఆరోపిస్తుండగా.. కాంగ్రెస్ మాత్రం ఈ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తూ తప్పుడు ప్రచారంగా కొట్టిపారేసింది.

×
×
Ad

బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్‌లో కాంగ్రెస్ పార్టీ భారీ సమావేశం నిర్వహించింది. బీకే హరిప్రసాద్ కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అదే సమయంలో రీ-నీట్ పరీక్ష ఉండటంతో ట్రాఫిక్ తీవ్రంగా ప్రభావితమైందని బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన తేజస్వీ సూర్య.. ‘‘వేలాది మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాస్తున్న రోజునే కాంగ్రెస్ ర్యాలీ నిర్వహించడం బాధ్యతారాహిత్యం. భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా పలువురు విద్యార్థులు ఆందోళనతో పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. కొందరు ఆలస్యంగా రావడంతో అధికారులను వేడుకుని పరీక్ష రాయాల్సి వచ్చింది.’’ అని అన్నారు. రాహుల్ గాంధీ విద్యార్థుల సమస్యలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించిన ఆయన.. ‘‘విద్యార్థుల పట్ల నిజంగా శ్రద్ధ ఉంటే కాంగ్రెస్ ఇంత పెద్ద రాజకీయ కార్యక్రమాన్ని పరీక్ష రోజు నిర్వహించేది కాదు.’’ అని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ కౌంటర్

తేజస్వి సూర్య ఆరోపణలకు కర్ణాటక హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే ఘాటుగా స్పందించారు. తేజస్వీ సూర్య పేరు ప్రస్తావించకుండా తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే ఎంపీ అంటూ విమర్శించారు. ఆర్‌సీ కాలేజీలో మొత్తం 720 మంది విద్యార్థులకు పరీక్ష కేంద్రం కేటాయించగా.. వారిలో 142 మంది గైర్హాజరయ్యారు. అయితే కేవలం ముగ్గురు మాత్రమే పరీక్షకు హాజరు కాలేకపోయారని చెప్పారు. వారిలో ఒక విద్యార్థిని మగడి ప్రాంతం నుంచి రావాల్సి ఉండగా సమయానికి బస్సు దొరకక ఆలస్యంగా చేరుకుందని తెలిపారు. మరో విద్యార్థి పాత హాల్ టికెట్ తీసుకురావడంతో పరీక్షకు అనుమతి లభించలేదన్నారు. మూడో అభ్యర్థి ఆర్‌టీ నగర్ వైపు నుంచి వస్తుండగా పరీక్ష మిస్ అయినట్లు తెలిసిందని.. ఇందుకు గల కచ్చితమైన కారణాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ముందుగానే ట్రాఫిక్ మార్పులపై ప్రజలకు సూచనలు జారీ చేశారని తెలిపారు. కాంగ్రెస్ ర్యాలీ కారణంగానే విద్యార్థులు పరీక్ష మిస్ అయ్యారని చెప్పడం వాస్తవాలను వక్రీకరించడమేనని ధ్వజమెత్తారు.

ప్రియాంక్ ఖర్గే మరో అడుగు ముందుకేసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘నీట్ పరీక్షల లీకులు, అవ్యవస్థ, విద్యార్థుల ఆందోళనలు, ఆత్మహత్యల సమయంలో బీజేపీ నాయకులు ఎందుకు మౌనం వహించారు?’’ అని ప్రశ్నించారు. ‘‘ఒక విద్యార్థి పరీక్ష మిస్ అయితే కాంగ్రెస్ ర్యాలీని నిందించాలంటే.. నీట్ పేపర్ లీకులు, పరీక్షల గందరగోళానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాలా?.’’ అని ఖర్గే ఎదురుదాడి చేశారు.

ఈ ఘటనతో బెంగళూరులో విద్యార్థుల పరీక్ష, ట్రాఫిక్ నిర్వహణ, రాజకీయ కార్యక్రమాల సమన్వయంపై మరోసారి చర్చ మొదలైంది. రాజకీయ విమర్శలు కొనసాగుతున్నప్పటికీ ముగ్గురు విద్యార్థులు పరీక్ష మిస్ కావడం మాత్రం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది.