బెంగాలీ యువ నటుడు రాహుల్ బెనర్జీ (43) అకాల మరణం చెందారు. సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఒడిశా-పశ్చిమ బెంగాల్ సరిహద్దుకు సమీపంలోని తల్సారి బీచ్‌లో ఈ విషాద ఘటన జరిగింది.
బెంగాల్ టీవీ సీరియల్ ‘‘భోలే బాబా పర్ కరేగా’’ (Bhole Baba Par Karega) షూటింగ్ ఆదివారం ఉదయం ప్రారంభమైంది. షూటింగ్ ముగిసిన తర్వాత రాహుల్ బెనర్జీ ఒంటరిగా సముద్రంలోకి వెళ్లారు. అయితే భారీ అలలు కారణంగా సముద్రంలోకి వెళ్లిపోయారు. అయితే ఈ విషయాన్ని ఎవరూ గమనించలేదు. కొద్దిసేపటికి కనిపించకపోవడంతో యూనిట్ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. వెంటనే సహనటులు, సాంకేతిక నిపుణులు గమనించి నీటిలోంచి బయటకు తీశారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటినా దీఘా ఉపవిభాగ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం సాయంత్రం 6:10 గంటలకు రాహుల్ బెనర్జీ చనిపోయినట్లుగా వైద్యులు ప్రకటించారు. దీంతో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
రాహుల్ బెనర్జీకి భార్య ప్రియాంక సర్కార్, ఒక కుమారుడు ఉన్నారు. భర్త మృతిపై ప్రియాంక సర్కార్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ‘‘ఇది మా కుటుంబానికి ఎంతో దుర్భరమైన సమయం. ఈ కష్టకాలంలో మా గోప్యతను గౌరవించాలని మీడియా, స్నేహితులను కోరుతున్నాం. మాకు కొంత సమయం ఇవ్వండి.’’ అని విజ్ఞప్తి చేశారు.
ఈ ఘటనపై సహనటుడు డిగంత బాగ్చి మాట్లాడుతూ… ‘‘షూటింగ్ ముగిసిన తర్వాత రాహుల్ ఒంటరిగా నీటిలోకి వెళ్లారు. ఏదో ఒక వస్తువులో చిక్కుకున్నట్లు అనిపించింది. మేమంతా కేకలు వేస్తూ బయటకు తీసి ఆస్పత్రికి తరలించాం.’’ అని తెలిపారు.
ప్రముఖుల సంతాపం
రాహుల్ బెనర్జీ మృతిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘రాహుల్ మరణం బెంగాలీ సినీ పరిశ్రమకు అపూర్వ నష్టం.’’ అని పేర్కొన్నారు. దర్శకుడు రాజ్ చక్రవర్తి, నటుడు-దర్శకుడు అంజన్ దత్ కూడా సంతాపం తెలిపారు.
రాహుల్ సినీ ప్రస్థానం
రాహుల్ 2008లో వచ్చిన ‘‘చిరోదిని తుమీ జే అమర్’’ చిత్రంతో మంచి పేరు సంపాదించారు. ఆ తర్వాత ‘‘తుమీ అస్బే బోలే’ (2014), ‘జుల్ఫికార్’ (2016), ‘బ్యోమకేశ్ గోత్రో’ (2018), ‘బిదే బ్యోమకేశ్’ (2018), ‘ది అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్’ (2025) వంటి చిత్రాల్లో నటించారు . టెలివిజన్‌లో ‘హర్గౌరీ పీస్ హోటల్’, ‘మొహోన్నా’ వంటి సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు చేరువయ్యారు. రాహుల్ ఆకస్మిక మరణం బెంగాలీ వినోద రంగానికి తీరని లోటుగా మిగిలింది.
