West Bebgal: పశ్చిమ బెంగాల్‌లో ఒక సింగర్‌పై సీఎం మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కార్యకర్త దాడికి యత్నించాడు. తూర్పు మిడ్నాపూర్‌లో ఒక పాఠశాలలో లైవ్ ప్రదర్శన ఇస్తున్న సమయంలో ‘‘సెక్యులర్’’ సాంగ్స్ పాడనందుకు టీఎంసీ స్థానిక నాయకుడు తనను వేధించాడని, శారీరకంగా దాడి చేస్తానని బెదిరించాడని ప్రముఖ బెంగాల్ సింగర్ లగ్నిజిత చక్రవర్తి ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం భగవాన్‌పూర్‌లోని ఒక స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది.
Read Also: PM Modi: ‘‘అస్సాంను పాక్‌కు అప్పగించాలని కాంగ్రెస్ కుట్ర’’.. మోడీ వ్యాఖ్యలపై హస్తం పార్టీ ఫైర్..
పోలీసుకు లిఖితపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదులో చక్రవర్తి మెహబూబ్ మాలిక్ అనే వ్యక్తి వేదికపైకి ఎక్కి అందరూ చూస్తుండగానే తనపై దాడి చేయడానికి ప్రయత్నించినట్లు ఆరోపించారు. సింగర్ ‘‘జాగో మా’’ పాట పాడిన తర్వాత ఆమెను అడ్డుకోవాలని ప్రయత్నించాడు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని ఆమె కోరింది. సెక్యులర్ సాంగ్స్ పాడనందుకే సింగర్‌ను లక్ష్యంగా చేసుకున్నాడని బీజేపీ ఆరోపించడంతో ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ఈ ఘటనపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బీజేపీ నేత శంకుదేబ్ పాండా ఆరోపించారు. కేసు నమోదు చేయడానికి బదులుగా ‘‘సారీ’’ చెప్పించే ప్రయత్నం చేశారని అన్నారు. 48 గంట్లో మాలిక్‌ను అరెస్ట్ చేయకుంటే నిరసన చేపడుతామని బీజేపీ హెచ్చరించింది.
