Site icon NTV Telugu

Murshidabad riots: బెంగాల్ ముర్షిదాబాద్ అల్లర్లపై గవర్నర్ సంచలన రిపోర్ట్.. ఉగ్రవాదంపై హెచ్చరిక..

Murshidabad Riots

Murshidabad Riots

Murshidabad riots: గత నెలలో వక్ఫ్ అల్లర్ల పేరుతో బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో మతకలహాలు చోటు చేసుకున్నాయి. ఈ అల్లర్లలో ముగ్గురు చనిపోయారు. ఆందోళనకారులు పలు వాహనాలకు, ఇళ్లకు నిప్పుపెట్టారు. ముస్లిం మెజారిటీ కలిగిన ముర్షిదాబాద్ ప్రాంతంలో, హిందువుల ఆస్తులపై దాడులు జరిగాయి. ఈ అల్లర్ల వల్ల వందలాది హిందూ కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. అల్లర్లపై బెంగాల్ ప్రభుత్వం, మమతా బెనర్జీలు సరైన చర్యలు తీసుకోలేదని ప్రతిపక్ష బీజేపీ ఆరోపించింది.

ఇదిలా ఉంటే, ముర్షిదాబాద్ అల్లర్లపై గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ సంచలన రిపోర్టు ఇచ్చారు. కేంద్రానికి ఇచ్చిన నివేదికలో రాష్ట్రంలో ‘‘రాడికలైజేషన్, ఉగ్రవాదం’’పై కేంద్రాన్ని హెచ్చరించారు. హోంమంత్రిత్వ శాఖకు ఇచ్చిన నివేదికలో అల్లర్లకు సంబంధించిన విషయాలను మతోన్మాదం, తీవ్రవాదం బెంగాల్‌కి సమస్యగా మారినట్లు అందులో పేర్కొన్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్‌తో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్న అనేక జిల్లాల్లో ఈ తరహా పరిస్థితులు ఉన్నట్లు చెప్పారు.

సరిహద్దు జిల్లాల్లో శాంతిభద్రతల ఆందోళనను నివేదిక హైలెట్ చేసింది. విచారణ కమిషన్ ఏర్పాటు, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న దుర్బల ప్రాంతాల్లో కేంద్ర బలగాలను శాశ్వతంగా మోహరించడం వంటి అనేక చర్యల్ని నివేదిక సూచించింది. బంగ్లా సరిమ్దదుల్లోని సంక్లిష్టమైన జనాభా స్వరూపం కలిగిన మాల్డా, ఉత్తర దినాజ్‌పూర్ వంటి జిల్లాల్లో హింసకు కారణమయ్యే అవకాశం ఉందని గవర్నర్ బోస్ హెచ్చరించారు. ఈ ప్రాంతాల్లో విభేదాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, హింస పెరిగిన నేపథ్యంలో బెంగాల్ సీఎం పదేపదే మైనారిటీ ప్రయోజనాలను రక్షిస్తామని చెప్పడం, ముస్లిం సమాజాన్ని శాంతిపచేసే చర్యలు పెద్దగా ఏం చేయలేదని నివేదికలో చెప్పారు.

Read Also: Jio Recharge: నెలకు కేవలం రూ.81కే అపరిమిత కాల్స్.. బేసిక్ యూజర్ల కోసం ప్రత్యేక ప్లాన్ విడుదల!

గవర్నర్ చేసిన సిఫారసులు ఇవే:

*రాష్ట్ర యంత్రాంగాలు కుప్పకూలినప్పుడు శాంతిభద్రతల సంక్షోభాలలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి అనుమతించే కేంద్ర చట్టాన్ని ప్రవేశపెట్టడం.
*పరిపాలనా లోపాలను పరిశీలించడానికి, దీర్ఘకాలిక రక్షణలను సూచించడానికి 1952 చట్టం ప్రకారం విచారణ కమిషన్ ఏర్పాటు.
*ముర్షిదాబాద్, మాల్డా వంటి దుర్బల సరిహద్దు ప్రాంతాలలో శాశ్వత BSF, కేంద్ర సాయుధ పోలీసు దళం (CAPF) అవుట్‌పోస్టుల మోహరింపు.
*సరిహద్దు ముప్పులు, సైద్ధాంతిక రాడికలైజేషన్‌ను పరిష్కరించడానికి బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న జిల్లాల్లో మెరుగైన నిఘా , నిఘా సమన్వయం.
*పరిస్థితి మరింత దిగజారితే, ఆర్టికల్ 356తో సహా రాజ్యాంగ ఎంపికల అన్వేషణ.
*పౌరులందరి భద్రత, రాజ్యాంగ హక్కులను నిర్ధారించడం అత్యంత ప్రాధాన్యతగా ఉండాలని, శాంతిభద్రతల నిష్క్రియాత్మకత లేదా రాజకీయీకరణ దేశ లౌకిక మరియు ప్రజాస్వామ్య నిర్మాణాన్ని బెదిరిస్తుందని గవర్నర్ ఉద్ఘాటించారు.

Exit mobile version