NTV Telugu Site icon

RG Kar protests: “ఆర్‌జీ కర్” నిరసనల్లో పాల్గొన్న డాక్టర్‌పై మమతా సర్కార్ ప్రతీకారం..

Rg Kar Protests

Rg Kar Protests

RG Kar protests: గతేడాది, కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ పీజీ వైద్యురాలిపై దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది. ఈ ఘటనపై యావత్ దేశం నిరసన, ఆందోళన నిర్వహించాయి. బాధితురాలికి న్యాయం చేయాలని డాక్టర్లు, ప్రజలు దేశవ్యాప్తంగా డిమాండ్ చేశారు. ముఖ్యంగా, ఈ ఘటన వల్ల పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), సీఎం మమతా బెనర్జీ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. ఈ కేసులో నిందితులకు అండగా టీఎంసీ సర్కార్ ఉందనే ఆరోపణలు కూడా వచ్చాయి.

Read Also: Chhava: ‘‘ఛావా’’ సినిమాని నిషేధించాలి.. అమిత్ షాకి ముస్లిం సంస్థ చీఫ్ లేఖ..

ముఖ్యంగా, కోల్‌కతాలో మహిళా వైద్యురాలికి న్యాయం కోసం డాక్టర్లు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. అయితే, ఇప్పుడు ఈ ఆందోళనల్లో పాల్గొన్న వారిపై మమతా సర్కార్ ప్రతీకారం తీర్చుకుంటోంది. నిరసనల్లో పాల్గొన్న ప్రభుత్వ వైద్యులను బదిలీ చేయడం, వారి హోదాను తగ్గించడం వంటి పనుల్ని చేస్తోంది. నిరసనల్లో ముందున్న డాక్టర్ సుబర్ణ గోస్వామిని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం గురువారం బదిలీ చేసింది.

పశ్చిమ బెంగాల్ పబ్లిక్ హెల్త్ కమ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ సభ్యుడిగా, ప్రస్తుతం దక్షిణ పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా బర్ధమాన్‌లో డిప్యూటీ CMOH-IIగా పనిచేస్తున్న గోస్వామి, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతంలోని డార్జిలింగ్ TB హాస్పిటల్ సూపరింటెండెంట్‌గా తక్షణమే నియమితులయ్యారని నోటిఫికేషన్‌లో పేర్కొంది. పుర్బా బర్ధమాన్ డిప్యూటీ CMOH-IV డాక్టర్ సునేత్రా మజుందార్, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు తన సాధారణ విధులకు అదనంగా తాత్కాలికంగా డిప్యూటీ CMOH-II బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపింది.