West Bengal: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. వీరిపై వేర్వేరు ప్రాంతాల్లో మింఖాకు చెందిన టీఎంసీ ఎమ్మెల్యే ఉషారాణి మండల్, సందేశ్‌ఖాలీకి చెందిన టీఎంసీ ఎమ్మెల్యే సుకుమార్ మహతా పైన ఈ దాడులు జరిగాయి. అయితే, ఎమ్మెల్యే ఉషారాణి మండల్ కాళీపూజ మండపానికి వెళ్లి పూజలు చేసి తిరిగి వస్తుండగా ఆమెపై దాడి చేశారు. హరోవా ప్రాంతంలో 150 మంది ఆమెను చుట్టుముట్టి.. తనను కారులోంచి బయటకు లాగి తుపాకీతో కాల్పులు చేశారని టీఎంసీ ఎమ్మెల్యే మండల్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఇక, లోక్‌సభ ఎన్నికలకు ముందు అక్రమ కార్యకలాపాలకు పాల్పడి, పార్టీ నుంచి సస్పెండ్ అయిన నేత తనపై దాడి చేశారని ఆరోపించారు.
Read Also: Fire Accident: స్క్రాప్ దుకాణంలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు
అలాగే, సందేశ్‌ఖాలీకి చెందిన టీఎంసీ ఎమ్మెల్యే సుకుమార్ మహతా నజత్‌లో జరిగిన కాళీ పూజకు వెళ్లి వస్తుండగా దాడి జరిగింది. ఈ ఘటన తర్వాత ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. తాను కాళీ పూజకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా.. కొందరు దుండగులు తన వాహనంపై దాడి చేశారని తెలిపారు. తనతో పాటు వస్తున్న పార్టీ కార్యకర్తలపైనా కూడా దాడి చేశారని చెప్పుకొచ్చారు. తీవ్రంగా గాయపడిన ఒక కార్యకర్తను ఆస్పత్రిలో చేర్చాం.. ప్రత్యర్థి వర్గం వారే ఈ దాడికి పాల్పడ్డారని ఎమ్మెల్యే సుకుమార్ మహతా ఆరోపణలు చేశారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ కేసుల్లో కొందరిని పోలీసులు అరెస్టు చేయగా.. మరికొందరి కోసం గాలిస్తున్నారు.