సమాజంలో రోజూ వార్తలు చూస్తూ ఉంటాం.. కానీ కొన్ని వార్తలు విన్నప్పుడు మాత్రం నవ్వాలో, ఏడవాలో తెలియదు. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న వార్త అలాంటిదే. ఒక వ్యక్తికి రాజకీయాలంటే బాగా ఇష్టం.. ఈసారి జరగబోయే ఎలక్షన్స్ లో నిలబడాలి అనుకున్నాడు. కానీ, అతనికి అప్పటికే పెళ్లి అయ్యి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ కారణంగా అతడికి సీటు రాలేదు. దీంతో ఎలాగైనా ఆ ఎలక్షన్స్ లో నిలబడడానికి ఆ వ్యక్తి ఒక బీభత్సమైన ఐడియా వేశాడు. తాను కాకపోయినా తన కుటుంబంలో ఎవరో ఒకరిని నిలబెట్టి గెలవాలనుకున్నాడు. దీని కోసం రెండో పెళ్లికి సిద్దమయ్యాడు. అయితే పెళ్లి అంటే చాలా తతంగం ఉంటుంది.. అమ్మాయిని వెతకాలి, తన గతం గురించి చెప్పాలి. ఆ అమ్మాయిని ఒప్పుకొన్నాక పెళ్లి చేసుకోవాలి.
ఇక ఇదంతా టైమ్ వేస్ట్ అనుకున్నాడో ఏమో సదురు వ్యక్తి .. నాకు రెండో భార్య కావాలి.. కాబోయే భార్యకు ఇలాంటి లక్షణాలు ఉండాలి.. కులం మతం పట్టింపు లేదు అంటూ ఊరు మొత్తం బ్యానర్లు కట్టించాడు. ఎన్నికల్లో పోటీ చేయడానికి తనకు రెండో భార్య కావాలంటూ ఆ వ్యక్తి కట్టిన బ్యానర్లు ప్రస్తుతం స్థానికంగా సంచలనం రేపుతున్నాయి. ఇక ఆ బ్యానర్ లో ఏమున్నాయి అంటే ” నేను ఎన్నికల్లో పోటీ చేయడానికి నాకు రెండో భార్య కావాలి. ఏ మతం అయినా పర్లేదు. పెళ్లి కాని లేక భర్తతో విడిపోయిన, భర్త మరణించిన 25 నుంచి 40 ఏళ్ల మహిళ అయ్యి ఉండాలి. ఆసక్తి గలవారు ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్ కి కాల్ చేయాలనీ తెలిపాడు. ఇక అతగాడి పేరు రమేష్.. ఇక ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. మరి ఈ అవకాశాన్ని ఏ అమ్మాయి సద్వినియోగం చేసుకుంటుందో అని ఊరంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట.