Site icon NTV Telugu

Devendra Fadnavis: నిషేధిత గ్రూప్ పీఎఫ్ఐ సైలెంట్‌ కిల్లర్‌ లాంటిది..

Devendra Fadnavis

Devendra Fadnavis

Devendra Fadnavis: ఐదేళ్లపాటు కేంద్రం నిషేధించిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) సమాజంలో హింసకు బీజం వేస్తోందనడానికి తగిన ఆధారాలు ఉన్నాయని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బుధవారం అన్నారు. సైలెంట్‌ కిల్లర్‌లా పుకార్లు వ్యాప్తి చేస్తూ హింసను ప్రేరేపించడమే పీఎఫ్‌ఐ లక్ష్యమని ఆయన వెల్లడించారు. దేశంలో మతసామరస్యాన్ని దెబ్బతీయడంతో పాటు యువతను ఐసిస్, లష్కరే తొయిబా, ఆల్‌ఖైదా వంటి ఉగ్రసంస్థల్లో చేరేలా ప్రోత్సహిస్తోందని పీఎఫ్‌ఐ సంస్థపై కేంద్రం ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. చట్ట విరుద్ధమైన సంస్థగా ప్రకటిస్తూ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ తక్షణమే అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్‌లో పేర్కొంది. పీఎఫ్ఐతో పాటు దాని అనుబంధ సంఘాల కార్యకలాపాలపై 5 ఏళ్ల పాటు నిషేధం విధించింది.

ఈ నేపథ్యంలో పీఎఫ్‌ఐ హింసకు బీజం వేస్తోందనడానికి ప్రభుత్వం, దర్యాప్తు సంస్థల వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. పుకార్లు వ్యాప్తి చేయడం, నిధుల సేకరణ, హింసను ప్రేరేపించడం వారి లక్ష్యమని ఆయన తెలిపారు. “ఈశాన్య రాష్ట్రంలో ఒక మసీదు కూల్చివేతకు సంబంధించిన నకిలీ వీడియో హింసను ప్రేరేపించే ఉద్దేశంతో ప్రచారం చేయబడింది. గతంలో అమరావతిలో ఇటువంటి సంఘటనను చూశాము. ఆ వీడియో బంగ్లాదేశ్‌కు చెందినది అని తరువాత వెలుగులోకి వచ్చింది” ఫడ్నవీస్ చెప్పారు. పీఎఫ్‌ఐని నిషేధించాలని డిమాండ్ చేసిన మొదటి రాష్ట్రం కేరళ అని ఫడ్నవీస్ అన్నారు. ఆ తర్వాత దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి డిమాండ్లు చేశాయి.

Congress Presidential Election: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో ఎన్ని ట్విస్టులో?.. బరిలో దిగ్విజయ్ సింగ్

కేంద్రప్రభుత్వం పీఎఫ్‌ఐని అన్ని రాష్ట్రాల మాదిరిగానే నిషేధించడంతో మహారాష్ట్రలో కూడా నిషేధం అమలుపై వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపారు. “కొన్ని గ్రూపులు దేశంలోని సామాజిక నిర్మాణాన్ని భంగపరచడానికి నిశ్శబ్దంగా పనిచేస్తున్నాయి. అటువంటి కార్యకలాపాలలో పీఎఫ్‌ఐ ముందుంది” అని ఆయన అన్నారు. నిషేధిత సంస్థ పీఎఫ్‌ఐ ఆటంకాలు సృష్టించడానికి అనేక కథనాలను రూపొందించడానికి ప్రయత్నిస్తోందన్నారు. పీఎఫ్‌ఐ వారి కార్యకలాపాల కోసం నిధులను సేకరించడం ప్రారంభించిందన్నారు.

Exit mobile version