Bangladesh: షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ వచ్చిన తర్వాత అక్కడి మహ్మద్ యూనస్ ప్రభుత్వం పాకిస్తాన్‌తో స్నేహాన్ని పెంపొందించుకుంటోంది. అక్కడి తాత్కాలిక ప్రభుత్వంలోని మెజారిటీ వర్గం భారత్‌ని వ్యతిరేకిస్తోంది. ప్రస్తుతం యూనస్ ప్రభుత్వంలో ఉన్న మెజారిటీ వర్గం మతోన్మాద సంస్థలైన జమాతే ఇస్లామీ, బీఎన్‌పీ పార్టీలకు చెందిన వారే. 1971 బంగ్లాదేశ్ ఊచకోతని మరిచి పాక్‌కి దగ్గరవుతోంది.
ఇదిలా ఉంటే, పక్కన ఉన్న భారత్‌ని కాదని పాకిస్తాన్ నుంచి దిగుమతులు పెంచుకోవాలని బంగ్లా ప్రభుత్వం అనుకుంటోంది. దశాబ్ధాల తర్వాత తొలిసారి పాకిస్తాన్ కరాచీ నుంచి బంగ్లాదేశ్ చిట్టగాంగ్‌కి కార్గో షిప్ నవంబర్ నెలలో వచ్చింది. ఇది భారత్‌లో ఆందోళల్ని పెంచింది. ఇదిలా ఉంటే ఈ వారంలో కరాచీ నుంచి కార్గో షిప్ చిట్టగాంగ్ రేవుకు చేరినట్లు బంగ్లా మీడియా పేర్కొంది. పనామా జెండాతో ఉన్న ఓడ ఎంవీ యువాన్ జియాంగ్ ఫా ఝాన్ ఆదివారం బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించింది. కరాచీ, దుబాయ్ మీదుగా ప్రయాణించిన ఈ ఓడలో 811 కంటైనర్లు ఉన్నాయి. వీటిలో పారిశ్రామిక పదార్థాలైన సోడా యాష్, డోలమైట్, మార్బుల్ బ్లాక్స్, వస్త్రాల ముడి పదార్థాలు, చక్కెర, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి బంగ్లాదేశ్ వర్తకులు అక్కడి ప్రభుత్వం ఒత్తిడి కారణంగా బలవంతంగా పాకిస్తాన్ నుంచి సరకులు దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తోంది.
Read Also: Ismail Haniyeh: ‘‘హనియేకు పట్టిన గతే హౌతీలకు’’.. హనియే హత్యని అంగీకరించిన ఇజ్రాయిల్..
ఇటీవల ఈజిప్ట్ కైరోలో పాక్ ప్రధాని షెహజాబ్ షరీఫ్‌తో, బంగ్లా చీఫ్ మహ్మద్ యూనస్ సమావేశమయ్యారు. ఈ సమావేశం జరిగిన ఒక రోజు తర్వాత తాజా పరిణామం జరిగింది. ఇరువురు నేతలు ఢాకా, ఇస్లామాబాద్ మధ్య సంబంధాలు బలపడాలని కాంక్షించారు. బలవంతంగా బంగ్లాదేశ్ వర్తకులు వీటిని దిగుమతి చేసుకోవాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ షిప్పింగ్ మంత్రిత్వ శాఖలో కొంతమంది అధికారులు చిట్టగాంగ్, మోంగ్లా ఓడరేవుల్లోకి భారత్‌కి ప్రవేశం కల్పించిన భారత్-బంగ్లాదేశ్ షిప్పింగ్ ఒప్పందాన్ని సమీక్షించాలని కోరుతున్నట్లు సమచారం.
చిట్టగాంగ్ రేవు బంగాళాఖాతంలో వ్యూహాత్మక ఓడ రేవు. 2004లో ఈ పోర్టులో చైనీస్ మందుగుండు సామాగ్రిని జప్తు చేశారు. దీనిని ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాదులకు అందించాలనేది లక్ష్యం. ఈ సామాగ్రిని పాకిస్తాన్ ఐఎస్ఐ పంపినట్లు ఆరోపణ. అయితే, ఆ తర్వాత షేక్ హసీనా, భారత్ మధ్య స్నేహంతో పాకిస్తాన్ నుంచి వచ్చే సరుకుల్ని మలేషియా, సింగపూర్, శ్రీలంకల్లో అప్‌లోడ్ చేసిన వాటిని బంగ్లాదేశ్‌కి వచ్చే నౌకల్లోకి బదిలీ చేయాలి. చిట్టగాంగ్‌ని కలిపే సముద్ర మార్గాలపై భారత నిఘా ఉండేది. అయితే, యూనస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాకిస్తాన్ నుంచి వచ్చే కార్గో భౌతిక తనిఖీలను తొలగించారు. దీంతో యథేచ్ఛగా పాక్ నౌకలు బంగ్లాదేశ్‌లోకి వచ్చే అవకాశం ఏర్పడింది. ఈ పరిణామాలు భారత్‌లో ఆందోళన పెంచుతున్నాయి.