Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఆ దేశంలోని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ గురువారం ఆమెకు వారెంట్ ఇష్యూ చేసింది. ఈ ఏడాది జరిగిన రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనల్లో షేక్ హసీనా మానవత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్లు, పలువురి చావుకు కారణమైనట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఆగస్టులో అక్కడి పరిస్థితులు హింసాత్మకంగా మారడంతో హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు.
ఇదిలా ఉంటే, హసీనాను అప్పటించే ప్రయత్నాన్ని భారత్ అడ్డుకుంటే తీవ్ర నిరసన వ్యక్తం చేస్తామని బంగ్లాదేశ్ హెచ్చరించింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంలో న్యాయ సలహాదారుగా ఉన్న ఆసిఫ్ నజ్రుల్ ఈ మేరకు భారత్‌ని హెచ్చరిస్తూ కామెంట్స్ చేశారు. నవంబర్ 18లోగా హసీనాతో పాటు 45 మంది సహ నిందితులను హాజరుపరచాలని అక్కడి కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆసిఫ్ గురువారం మాట్లాడారు. తమకు చాలా చట్టపరమైన ఏర్పాట్లు ఉంటాయని, అయితే “భారత్ దీన్ని నిజాయితీగా అర్థం చేసుకుంటే, హసీనా (బంగ్లాదేశ్‌కు) తిరిగి రావడానికి భారతదేశం ఖచ్చితంగా కట్టుబడి ఉంటుంది” అని అన్నారు. భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య ఇప్పటికే నేరస్తుల అప్పగింత ఒప్పందం కుదిరిందని చెప్పారు.
Read Also: Bomb threats: ఆగని బాంబు బెదిరింపులు.. ఈ రోజు 6 ఇండిగో విమానాలకు బెదిరింపులు..
విచారణ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత హసీనాని తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ అధికారికంగా కోరుతుందని నజ్రుల్ గత నెలలో మీడియాతో చెప్పారు. ఇదిలా ఉంటే, హసీనాకు ఆశ్రయం కల్పించడం ఒక హంతకుడికి, నేరస్థుడికి ఆశ్రయం కల్పించినట్లేనని హసీనా ప్రధాన ప్రత్యర్థి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సీనియర్ జాయింట్ సెక్రటరీ జనరల్ అడ్వకేట్ రుహుల్ కబీర్ రిజ్వీ అన్నారు. దౌత్యప్రక్రియ ద్వారా ఆమెను మేము బంగ్లాదేశ్‌కి తీసుకురావాల్సి ఉందని, ఆమె దాదాపుగా 200 కేసుల్ని ఎదుర్కొంటోందని చెప్పారు. హసీనా ప్రభుత్వ పతనం తరువాత దేశవ్యాప్తంగా చెలరేగిన హింసలో వందలాది మంది మరణించారు, జూలై మధ్యలో నిరసనలు ప్రారంభమైనప్పటి నుండి మరణించిన వారి సంఖ్య 1,000 కంటే ఎక్కువగా ఉంది.