NTV Telugu Site icon

Bangladesh: షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు: నివేదిక

Bangladesh

Bangladesh

Bangladesh: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటాను వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాత్మక ఆందోళనలు ఏకంగా షేక్ హసీనా ప్రభుత్వాన్నే కూల్చాయి. బంగ్లాదేశ్ స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు ఇచ్చిన రిజర్వేషన్లను క్యాన్సిల్ చేయాలని విద్యార్థులు, ప్రజలు ఆందోళనలు చేశారు. చివరకు ఆ దేశ ఆర్మీ ఇచ్చిన అల్టిమేటంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఇండియా పారిపోయి వచ్చారు.

ఇదిలా ఉంటే, షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత నుంచి ఆ దేశంలో మైనారిటీలు ముఖ్యంగా హిందువులపై దాడులు జరిగాయి. హింసాత్మక బంగ్లాదేశ్‌లోని మైనారిటీ సంస్థ బంగ్లాదేశ్ ఛత్ర ఓక్య పరిషత్ పంచుకున్న నివేదిక ప్రకారం, ఆగస్టు 5న షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం పతనం తర్వాత మైనారిటీ వర్గాలకు చెందిన కనీసం 49 మంది ఉపాధ్యాయులు రాజీనామా చేయవలసి వచ్చింది.బంగ్లాదేశ్ ఛత్ర ఓక్య పరిషత్ బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్య పరిషత్ విద్యార్థి విభాగం. మైనారిటీ వర్గాలకు చెందిన ఉపాధ్యాయులు బలవంతంగా రాజీనామాలను చేయాల్సి వచ్చిందని శనివారం నివేదికను విడుదల చేశారు.

Read Also: Giriraj Singh: ‘‘హిందువులు ఎప్పుడూ సెలవులను డిమాండ్ చేయరు’’.. నమాజ్ బ్రేక్ రద్దుపై కేంద్రమంత్రి..

దేశవ్యాప్తంగా మైనారిటీ ఉపాధ్యాయులు భౌతిక దాడుల్ని ఎదుర్కొన్నారు. వారిలో కనీసం 49 మంది రాజీనామా చేయాల్సి వచ్చిందిన సమన్వయకర్త సాజిబ్ సర్కార్ చెప్పారు. అయితే, వీరిలో 19 మందిని తర్వాత తిరిగి నియమించినట్లు నివేదిక పేర్కొంది. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం పతనం తర్వాత బంగ్లాదేశ్‌లోని హిందువులు, బౌద్ధులు, క్రైస్తవ సంఘాల సభ్యులపై అనేక హింసాత్మక సంఘటనలు జరిగాయి. దేవాలయాలను తగలబెట్టడంతో పాటు మహిళలపై అత్యాచారాలు చోటు చేసుకున్నాయి.

ఈ అల్లర్ల తర్వాత నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ నేతృత్వంలో ఆ దేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ మరియు బంగ్లాదేశ్ పూజ ఉద్జపన్ పరిషత్ సంస్థలు సంకలనం చేసిన డేటా ప్రకారం, హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం పడిపోయినప్పటి నుండి దేశంలోని మైనారిటీ వర్గాల సభ్యులు 52 జిల్లాల్లో కనీసం 205 దాడులను ఎదుర్కొన్నారు.