NTV Telugu Site icon

Bangladesh: భారత్‌లోని ఇద్దరు దౌత్యవేత్తలను వెనక్కి పిలిచిన బంగ్లాదేశ్

Bangladesh

Bangladesh

Bangladesh: భారతదేశంలోని ఇద్దరు సీనియర్‌ దౌత్యవేత్తలు తక్షణమే తిరిగి రావాలని బంగ్లాదేశ్‌ సర్కార్ ఆదేశించింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిపోతున్నాయి. కోల్‌కతాలోని డిప్యూటీ హైకమిషనర్‌ షిక్దార్‌ మహమ్మద్‌ అష్రఫుల్‌ రహ్మాన్‌, త్రిపురలోని అగర్తలలో గల అసిస్టెంట్‌ హైకమిషనర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ను రీకాల్‌ చేస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రకటించింది. అయితే, ఇస్కాన్‌కు చెందిన హిందూ ప్రచారకర్త చిన్మయ్‌ కృష్ణదాస్‌ను అరెస్టును నిరసిస్తూ.. పశ్చిమ బెంగాల్‌, త్రిపుర రాష్ట్రాల్లోని బంగ్లా రాయబార ఆఫీసుల దగ్గర ఆందోళనలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఈ దౌత్యవేత్తలను వెనక్కి పిలిచినట్లు సమాచారం.

Read Also: Tata Nano EV : టాటా నానో ఈవీ వచ్చేస్తుంది?.. ధర ఎంతంటే?

అయితే, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వీరిద్దరూ ఢాకా నుంచి పని చేయాలని సూచించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అష్రఫుల్‌ రహ్మాన్‌ నిన్ననే బంగ్లాదేశ్‌కు వెళ్లినట్లు సమాచారం. ఇక, త్రిపురలోని ఆరిఫ్‌ రేపు (డిసెంబర్ 7) స్వదేశానికి వెళ్లనున్నారు. కాగా, ఇటీవల త్రిపురలోని అగర్తలాలో ఉన్న బంగ్లాదేశ్‌ అసిస్టెంట్‌ హైకమిషన్‌ ఆఫీస్ ముందు వందల మంది ప్రజలు ఆందోళన చేశారు. ఆ కార్యాలయం బంద్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా కొందరు రాయబార క్యాంప్ కార్యాలయంలోకి దూసుకెళ్లినట్లు సమాచారం. దీనిపై బంగ్లాదేశ్‌ విదేశాంగశాఖ మాట్లాడుతూ.. ఉద్దేశపూర్వకంగానే నిరసనకారులను ఆఫీసులోకి పంపించారని ఆరోపించింది. ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌ జాతీయ పతాకంతో పాటు మరి కొన్ని వస్తువులు ధ్వంసమైనట్లు వెల్లడించింది.