Bangladesh MP: బంగ్లాదేశ్ అధికార పార్టీ అవామీ లీగ్ ఎంపీ కోల్‌కతాలో అదృశ్యం కావడం సంచనలంగా మారింది. వైద్యం కోసం మే 12న దేశానికి వచ్చిన బంగ్లా ఎంపీ అన్వరుల్ అజీమ్ అదృశ్యమయ్యారు. చివరిసారిగా మే 14న అతను తన స్నేహితుడి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అప్పటి నుంచి అతడు కనిపించకుండా పోయాడు. దీనిపై భారత్, బంగ్లాదేశ్ అధికారులు విచారణ చేపట్టారు. అన్వరుల్ అజీమ్ ఐదు రోజుల క్రితం చికిత్స కోసం కోల్‌కతాకు వచ్చిన తర్వాత అదృశ్యమైనట్లు అధికారులు మంగళవారం తెలిపారు. అవామీ లీగ్‌లో మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన జాడ కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది.
ఆయన మే 12న కోల్‌కతాకు చేరుకున్నారు, అప్పటి నుంచి అతను తన కుటుంబాన్ని సంపద్రించలేదు. మే 14 నుంచి ఎంపీ ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎంపీ కుటుంబం ఈ విషయాన్ని బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో ప్రస్తావించగా.. పీఎం కార్యాలయం ఢిల్లీ, కోల్‌కతాలోని దౌత్తవేత్తలను అప్రమత్తం చేసింది. వారు పోలీసులతో కలిసి విచారణ ప్రారంభించారు. అన్వరుల్‌కి కోల్‌కతా బాగా తెలుసని, అతనికి నగరంలో చాలా మంది పరిచయస్తులు ఉన్నారని తెలిసింది. మే 12న ఎంపీ బారానగర్‌లోని గోపాల్ బిశ్వాస్ అనే తన స్నేమితుడికి ఇంటికి వెళ్లినట్లు కాన్సులేట్ అధికారి తెలిపారు. మే 14న మళ్లీ తిరిగి వస్తానని చెప్పినప్పటికీ, అతను రాలేదు. దీంతో గోపాల్ బిశ్వాస్ కోల్‌కతా పోలీసుల వద్ద మిస్సింగ్ కేసు నమోదు చేశాడు.
Read Also: Swati Maliwal: ‘నా పర్సనల్ ఫోటోలు లీక్ చేయాలని వారిపై ఒత్తిడి’’.. స్వాతి మలివాల్ సంచలనం..
ఎంపీ బంగ్లాదేశ్ కనెక్షన్‌తో పాటు భారత సిమ్‌లను కూడా ఉపయోగిస్తున్నారు. రెండు ఫోన్లు ప్రస్తుతం స్విచ్ఛాప్‌లో ఉన్నాయి. ఎంపీ అన్వరుల్ అజీమ్ కుమార్తె ముంతారిన్ ఫిర్దౌస్ మంగళవారం ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగానికి తన తండ్రి అదృశ్యంపై ఫిర్యాదు చేసింది.సీనియర్ బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ అధికారి మహ్మద్ హరూన్ రషీద్ ప్రకారం.. ఎంపీ ఫోన్ కొన్ని సార్లు స్విచ్ఛాప్, కొన్ని సార్లు పనిచేసినట్లు పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ఎంపీని ఎవరైనా హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య చేసి మృతదేహాన్ని కోల్‌కతాలోని న్యూటౌన్ ప్రాంతంలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్న సమయంలో న్యూటౌన్‌లోని ఫ్లాట్‌లో రక్తపు మరకలు ఉన్నట్లు గుర్తించారు.