NTV Telugu Site icon

Bangladesh: మరో భారత వ్యతిరేకిని విడుదల.. పీఓకేలో ఉగ్రవాదానికి సాయం..

Abdus Salam Pintu

Abdus Salam Pintu

Bangladesh: షేక్ హసీనా ప్రధాని పదవి కోల్పోయిన తర్వాత, బంగ్లాదేశ్‌లో కోలువు తీరిన మహ్మద్ యూనస్ సర్కార్ భారత వ్యతిరేక చర్యల్ని ప్రోత్సహిస్తోంది. అక్కడి రాడికల్ ఇస్లామిక్ శక్తులు హిందువుల, ఇతర మైనారిటీలు టార్గెట్‌గా దాడులకు తెగబడుతున్నారు. ఇదే కాకుండా జమాతే ఇస్లామీ, బీఎన్‌పీ పార్టీకి చెందిన పలువురు వివాదాస్పద నేతల్ని జైళ్ల నుంచి విడుదల చేస్తోంది. ఈ రెండు పార్టీలు కూడా భారత్‌ అంటేనే ఎప్పుడూ ద్వేషిస్తూ ఉంటాయి. పలువురు ఉగ్రవాదులతో పాటు పాకిస్తాన్ అనుకూల, భారత వ్యతిరేఖ వ్యక్తుల్ని యూనస్ ప్రభుత్వం విడుదల చేసింది.

ఇదిలా ఉంటే, తాజాగా బంగ్లాదేశ్ మాజీ జూనియర్ మంత్రి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) సభ్యుడు అబ్దుస్ సలామ్ పింటూని 17 ఏళ్ల జైలు శిక్ష తర్వాత విడుదల చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో ఉగ్రవాదులు నిధులు సమకూర్చిన పింటూ, పాకిస్తాన్ ఉగ్ర సంస్థ హర్కత్ ఉల్ జిహాద్ అల్ ఇస్లామీ(హుజీ)కి గట్టి మద్దతుదారుడు. భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించాడు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడు.

Read Also: Pakistan-Afghanistan: పాకిస్థాన్‌పై తాలిబన్ల భారీ దాడి.. యుద్ధం తప్పదా?

పీఓకేలో ఉగ్రవాదులను రిక్రూట్ చేయడంలో, శిక్షణ ఇవ్వడంలో, కశ్మీర్‌లో తిరుగుబాటుదారుల కోసం ఆయుధాలను సేకరించడంలో పింటూ కీలక పాత్ర పోషించాడు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాపై 2004లో జరిగిన గ్రెనేడ్ దాడిలో కూడా అతనికి సంబంధం ఉంది. ఆమె ప్రభుత్వాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో దాడి చేశాడు. గ్రెనేడ్ దాడిలో పాల్గొన్న మరో బీఎన్‌పీ నేత లుట్‌ఫోజ్జామన్ బాబర్‌ని నిర్దోషిగా విడుదల చేసిన తర్వాత పింటూను కూడా విడుదల చేసింది. ఇద్దరు వ్యక్తులకు హుజీతో సంబంధాలు ఉన్నాయి. వీరిద్దరు మదర్సా విద్యార్థులను రిక్రూట్ చేయడం, భారత‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం చేశారు.

వారణాసి, అజ్మీర్ షరీఫ్ దర్గా, ఢిల్లీ బాంబు దాడులకు హుజీ పాల్పడింది. దీనికి పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ మద్దతు కూడా ఉంది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ కి కూడా ఐఎస్ఐ సహకరిస్తోంది. పింటూ విడుదల భారతదేశానికి ఆందోళనకర పరిణామం. ఇప్పటికే బంగ్లా వ్యాప్తంగా ఐఎస్ఐ ప్రభావం క్రమంగా పెరుగుతోంది. రాడికల్ ఇస్లామిక్ శక్తులు, ఉగ్రవాద శక్తులు క్రియాశీలకంగా మారాయి. మహ్మద్ యూనస్ మాత్రం వీటన్నింటి పట్టించుకోవడం లేదు. మతోన్మాద శక్తుల చేతిలో కీలుబొమ్మగా మారాడు.

Show comments