Atul Subhash Case: భార్య తప్పుడు కేసులతో వేధింపులకు గురైన బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, ఈ కేసులో ఇప్పటికే సుభాష్ భార్య నిఖితా సింఘానియాతో పాటు ఆమె తల్లి, సోదరుడిని బెంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే, ఈ కేసులో కీలక పరిణామం ఎదురైంది. అతుల్ సుభాష్ తల్లి తన నాలుగేళ్ల మనవడి కస్టడీ కోరుతూ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. తన మనవడిని తనకు అప్పగించాలని అంజు మోదీ సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న నిఖితా కుటుంబం, పిల్లాడి ఆచూకీని వెల్లడించలేదని పిటిషన్‌లో ఆమె పేర్కొన్నారు. అతుల్ సుభాష్ తల్లి అంజు మోడీ తన పిటిషన్‌లో.. బిడ్డను కనుగొనే ప్రయత్నాలను సింఘానియా కుటుంబం అడ్డుకున్నట్లు చెప్పింది. సుభాష్ తండ్రి పవర్ కుమార్ కూడా బిడ్డను కస్టడీకి ఇవ్వాలని బహిరంగంగా డిమాండ్ చేశారు.
Read Also: Cars24 CEO: కన్నడ మాట్లాడటం రాదా? ఢిల్లీకి రండి.. రచ్చకు దారి తీసిన పోస్ట్..
పిల్లాడిని ఫరీదాబాద్‌లోని బోర్డింగ్ స్కూల్‌లో చేర్పించారని, తన అంకుల్ సుశీల్ సింఘానియా కస్టడీలో ఉన్నాడని నిఖితా పోలీసులకు చెప్పినట్లు సమాచారం. అయితే, పిల్లాడి ఆచూకీ తనకు తెలియదని సుశీల్ కొట్టిపారేశారు. ఈ పిటిషన్‌ని బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడా ధర్మాసనం విచారించింది. దీనిపై స్పష్టత ఇవ్వాలని ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, కర్ణాటక ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జనవరి 07న జరగనుంది.
డిసెంబర్ 09న బెంగళూర్‌లో అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి ముందు 24 పేజీల లేఖ, గంటకు పైగా ఉన్న వీడియో రికార్డ్ చేశారు. వీడియోలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను వెల్లడించారు. తన భార్య తనను తప్పుడు కేసుల్లో ఇరికించిందని, చివరకు న్యాయమూర్తి కూడా లంచం డిమాండ్ చేసిందని ఆరోపించాడు. ఈ కేసులో అతుల్ భార్య నిఖితా సింఘానియాతో పాటు తల్లి నిషా సింఘానియి, సోదరుడు అనురాగ్ సింఘానియాను డిసెంబర్ 16న అరెస్ట్ చేశారు. ముగ్గురిపై ఆత్మహత్యకు ప్రేరేపించిన చట్టాల కింద కేసులు నమోదు చేశారు.