NTV Telugu Site icon

Canada: ఇందిరా గాంధీ హత్యపై పోస్టర్లు.. ఖలిస్తానీల దురాగతం..

Khalistan

Khalistan

Canada: ఖలిస్తానీ మద్దతుదారులు అరాచకాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కెనడా వంటి దేశాలు వీరి పట్ల ఉదాసీన వైఖరిని చూపుతుండటంతో అక్కడ ర్యాడికల్ ఖలిస్తానీలు రెచ్చిపోతున్నారు. కెనడాలో పాటు, ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాల్లో భారత వ్యతిరేక ధోరణులు అవలంభిస్తు్న్నారు. తాజాగా ఆపరేషన్ బ్లూస్టార్ 40వ వార్షికోత్సవం సందర్భంగా కెనడా వాంకోవర్‌లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, భారత కాన్సులేట్ కార్యాలయం ముందు మాజీ ప్రధాని ఇందిరాగాంధీని హత్య చేస్తున్నట్లు చిత్రీకరించారు. అక్టోబర్ 31, 1984న ఆమె అంగరక్షకులు కాల్చి చంపిన విధానాన్ని ప్రదర్శించారు. ప్రత్యేక ఖలిస్తాన్ దేశం కోసం డిమాండ్ చేస్తున్న సిక్కు ఉగ్రవాద సంస్థ ‘‘సిఖ్ ఫర్ జస్టిస్’’ (SFJ) గ్రూప్ ఈ నిరసనను నిర్వహించింది.

Read Also: Rahul Gandhi: ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ.. తీర్మానాన్ని ఆమోదించిన కాంగ్రెస్..

దీనిని హిందూ-కెనడియన్ ఎంపీ చంద్ర ఆర్య తీవ్రంగా తప్పుపట్టారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని జస్టిన్ ట్రూడో ప్రభుత్వాన్ని కోరారు. ‘‘వాంకోవర్‌లో ఖలిస్థాన్ మద్దతుదారులు, హిందూ భారత ప్రధాని ఇందిరా గాంధీ శరీరంపై బుల్లెట్ రంధ్రాలు ఉన్నాయని, ఆమె అంగరక్షకులు తుపాకులు పట్టుకుని హంతకులుగా మారారని, మళ్లీ హిందూ-కెనడియన్లలో హింస భయం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు’’ అని ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తాజా సంఘటన హిందూ కెనడియన్లకు బెదిరింపులకు కొనసాగింపు అని ఆయన అన్నారు.

కెనడియన్ పబ్లిక్ సేఫ్టీ మినిస్టర్ డొమినిక్ లెబ్లాంక్ మాట్లాడుతూ.. హింసను ప్రోత్సహించడం ఎన్నటికీ ఆమోదయోగ్యం కాదని అన్నారు. ‘‘వాంకోవర్‌లో భారత ప్రధాని ఇందిరా గాంధీ హత్యను వర్ణించే చిత్రాల నివేదికలు వచ్చాయి. కెనడాలో హింసను ప్రోత్సహించడం ఎన్నటికీ ఆమోదయోగ్యం కాదు’’ అని ట్వీట్ చేశారు. 1984లో అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్ నుండి ఖలిస్తానీ తీవ్రవాదులతో సహా వారి నాయకుడు జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే తొలగించే లక్ష్యంతో ‘‘ఆపరేషన్ బ్లూస్టార్’’ చేపట్టారు. ఈ ఘటన కారణంగానే ఇందిరాగాంధీ హత్య జరిగింది.