NTV Telugu Site icon

Arvind Kejriwal: జైలులో కేజ్రీవాల్‌ని కలిసిన అతిషి, రాఘవ్ చద్దా.. ఢిల్లీ నీటి సంక్షోభంపై చర్చ..

Atishi

Atishi

Arvind Kejriwal: ఢిల్లీలో నీటి సంక్షోభం తారాస్థాయికి చేరింది. నీటి కోసం ప్రజలు ట్యాంకర్ల వెంట గుమిగూడిన దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఢిల్లీలో కొనసాగుతున్న నీరు మరియు విద్యుత్ సంక్షోభాల మధ్య, తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని మంత్రి అతిషీ, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాలు ఈ రోజు కలిశారు. సీఎం కేజ్రీవాల్ వీలైనంత త్వరగా ఢిల్లీలో నీటి సమస్యల్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

‘‘కేంద్ర ప్రభుత్వం తప్పుడు కేసుతో తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్‌ని ఈ రోజు కలిశాను. ఆయన తన కన్నా ఢిల్లీ ప్రజల గురించే ఆందోళన చెందుతున్నారు. విద్యుత్, నీటి సమస్యల గురించి ఆరా తీశారు. ఢిల్లీలో నీటి ఎద్దడిని తాను తీహార్ జైలులో చూసినట్లు చెప్పారు.’’ అని మీడియాతో అతిషి అన్నారు. వీలైనంత త్వరగా నీటి ఎద్దడిని అధిగమించేందుకు అవసరమైన అన్ని చర్యలు మరియు ఏర్పాట్లు చేయాలని కేజ్రీవాల్ తమని ఆదేశించారని చెప్పారు. ఆప్ ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలోకి వెళ్లి వారి ప్రాంతాల ప్రజలకు నీరు అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారని అన్నారు.

Read Also: UP: టెర్రస్ పై నిద్రిస్తున్న 6ఏళ్ల బాలుడిని ఎత్తుకెళ్లిన చిరుత..ప్రాణాలు వదిలిన చిన్నారి

రెండు రోజుల క్రితం ఉత్తర్ ప్రదేశ్‌లో అగ్ని ప్రమాదం కారణంగా ఢిల్లీలో విద్యుత్ కోతల గురించి కూడా కేజ్రీవాల్ ఆరా తీశారని, భవిష్యత్తులో విద్యుత్ సంక్షోభం తలెత్తకుండా ఉండేందుకు సంబంధిత అధికారులతో సమావేశాలను నిర్వహించాలని సూచించినట్లు అతిషి చెప్పారు. జైలులో ఉండి కూడా కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలు, వారి సమస్యల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారని ఆమె వెల్లడించారు. బుధవారం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ తీహార్‌లో కేజ్రీవాల్‌ను పరామర్శించారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ని మార్చిలో ఈడీ అరెస్ట్ చేసింది. దాదాపుగా 50 రోజులు జైలులో ఉన్న తర్వాత ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు మే నెలలో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 20 రోజుల తర్వాత ఆయన జూన్ 2న తీహార్ జైలులో లొంగిపోయారు. ఈ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారి అని ఈడీ ఆరోపించింది.