NTV Telugu Site icon

Assam: ముస్లిం వివాహాలు-విడాకుల చట్టాన్ని రద్దు చేసిన అస్సాం..

Assam

Assam

Assam: యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేసే దిశగా అస్సాంలోని హిమంత బిశ్వ సర్మ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. అస్సాం అసెంబ్లీ గురువారం రాష్ట్రంలోని ముస్లిం వివాహాలు-విడాకులుకు సంబంధించి పాత చట్టాన్ని తొలగించి, వివాహాలు విడాకులకు ప్రభుత్వ నమోదును తప్పనిసరి చేసే బిల్లును ఆమోదించింది. ‘‘అస్సాం తప్పనిసరి ముస్లిం వివాహాలు మరియు విడాకుల నమోదు బిల్లు- 2024’’ని రాష్ట్ర రెవెన్యూ మినిస్టర్ జోగెన్ మోహన్ మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ముస్లిం వివాహాలు మరియు విడాకుల నమోదు చట్టం-1935ని రద్దు చేసింది.

Read Also: PM Modi: శుక్రవారం మహారాష్ట్రలో మోడీ పర్యటన.. ముంబై జీఎఫ్ఎఫ్ సదస్సులో ప్రసంగం

ఈ విషయంపై ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ, కాజీలు గతంలో జరిపిన వివాహాల రిజిస్ట్రేషన్లన్నీ చెల్లుబాటు అవుతాయని, కొత్తవి మాత్రమే చట్టం పరిధిలోకి వస్తాయని అన్నారు. “ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఇస్లామిక్ ఆచారాల ప్రకారం జరిగే వివాహాలకు మేము అస్సలు జోక్యం చేసుకోవడం లేదు. మా ఏకైక షరతు ఏమిటంటే ఇస్లాం నిషేధించిన వివాహాలు నమోదు చేయబడవు.’’ అని అన్నారు. బాల్య వివాహాలను నిర్మూలించడంతో పాటు, కాజీ వ్యవస్థను దూరం చేయడమే మా లక్ష్యమని చెప్పారు. ముస్లిం వివాహాలు, విడాకులను రిజిస్ట్రేషన్ ద్వారా ప్రభుత్వం వ్యవస్థ కిందకు తీసుకురావాలని అనుకున్నామన్నారు.

ఈ కొత్త చట్టం బాల్య వివాహాలను పూర్తిగా నిషేధిస్తుందని సీఎం చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని వివాహాల రిజిస్ట్రేషన్ జరగాలని, అయితే ఈ ప్రయోజనాల కోసం కాజీల వంటి ప్రైవేట్ సంస్థలకు రాష్ట్రం మద్దతు ఇవ్వదని చెప్పారు. ‘‘సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడే మా ప్రయత్నంలో ఈ రోజు చారిత్రాత్మకమైంది. ఈ బిల్లు ద్వారా ప్రభుత్వం వివాహాల రిజిస్ట్రేషన్లను తప్పనిసరి చేస్తుంది. బాలికలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 ఏళ్ల వయసుని చట్టబద్ధం చేస్తుంది’’ అని ఆయన ట్వీట్ చేశారు. ఈ బిల్లు బాల్యవివాహాలను నిరోధించడంతో పాటు ఆడ పిల్లలకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించే సాధనం, బహు భార్యత్వాన్ని నిషేధిస్తుందని అన్నారు. గతంలో ముస్లిం వివాహాలు కాజీలు అమలుపరిచేవారు. వీటి ద్వారా బాల్య వివాహాలు జరిగేవి. వీటిపై ప్రభుత్వ పర్యవేక్షణ కూడా లేదు.