Asaduddin Owaisi: మహ్మద్ ప్రవక్తపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. దేశాన్ని నాశనం చేయడానికి బీజేపీ ఉద్దేశపూర్వక ప్రయత్నమంటూ ఆయన ఆరోపించారు. ‘బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. హైదరాబాద్‌లో శాంతిని చూడాలని బీజేపీ కోరుకోవడం లేదు. వారు ప్రవక్త ముహమ్మద్‌ను, ముస్లింలను ద్వేషిస్తారు. భారతదేశ సామాజిక వ్యవస్థను నాశనం చేయాలని చూస్తున్నారు.’ అని అసదుద్దీన్ ఒవైసీ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్రమోడీ కనీసం స్పందించాలని ఆయన అన్నారు. రాజకీయంగా తమతో పోరాడండి కానీ ఇలా కాదన్నారు. ఈ వ్యాఖ్యలకు ప్రధాని మోడీ, బీజేపీ మద్దతు ఇవ్వకపోతే స్పందించాలన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని వారికి తాను చెబుతాను అని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మహ్మద్ ప్రవక్తపై దైవదూషణ వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను హైదరాబాద్ పోలీసులు ఈరోజు తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ సౌత్ జోన్ పోలీసులు మంగళవారం ఉదయం రాజాసింగ్‌పై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. అతనిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 153ఏ, 295, మరియు 505 కింద దబీర్‌పురా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యాఖ్యలు చేసిన వీడియోను విడుదల చేయడంతో సోమవారం అర్థరాత్రి హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో నిరసనలు చెలరేగాయి. బీజేపీ ఎమ్మెల్యేపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. బషీర్ బాగ్‌లోని కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు.
Kishan Reddy: రాజాసింగ్‌ను ఎందుకు సస్పెండ్ చేశారో నాకు తెలీదు
దబీర్‌పురా పోలీస్ స్టేషన్‌లోని ఇన్‌స్పెక్టర్ ప్రకారం.. గత రాత్రి 250 మందికి పైగా ప్రజలు దబీర్‌పురా పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు గుమిగూడారు, రాజా సింగ్ ప్రవక్త గురించి అవమానకరమైన వీడియోను పంచుకున్నారని. సమాజంలోని మతపరమైన మనోభావాలను కించపరిచారని పేర్కొన్నారు. తాము వెంటనే సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఆగస్ట్ 20న హైదరాబాద్‌లో స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ నిర్వహించిన షోను వ్యతిరేకించడంతో ఆగస్ట్ 19న బీజేపీ ఎమ్మెల్యేను గృహనిర్బంధంలో ఉంచారు. మరోవైపు హైదరాబాద్ పోలీసులు భద్రతను పెంచి హైదరాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయం వెలుపల బలగాలను మోహరించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కూడా పెంచారు.