Site icon NTV Telugu

Asaduddin Owaisi: ముస్లింలలో సంతానోత్పత్తి రేటు క్షీణించింది.. జనాభా నియంత్రణ అవసరం లేదు.

Asaduddin Owaisi

Asaduddin Owaisi

No Need For Population Control says Asaduddin Owaisi: దేశంలో ఇప్పటికే రీప్లేస్మెంట్ రేటు సాధించిందని.. జనాభా నియంత్రణ అవసరం లేదని ఎంఐఎం చీప్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. బుధవారం ఆర్ఎస్ఎస్ వార్షిక దసరా కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై అసదుద్దీన్ స్పందించారు. హిందువులు, ముస్లింలకు ఒకే డీఎన్ఏ ఉంటే అసమతుల్యత ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. వృద్ధాప్య జనాభా, వృద్ధులను ఆదుకోలేక నిరుద్యోగ యువత ఆందోళన చెందుతుందని ఆయన అన్నారు. సంతానోత్పత్తి రేటు ముస్లింలతో తీవ్రంగా క్షీణించిందని ఆయన అన్నారు.

మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను విద్వేశ వ్యాఖ్యలుగా అసదుద్దీన్ ఓవైసీ అభివర్ణించారు. విద్వేశపూరిత వార్షిక దినంగా ఆయన ఆర్ఎస్ఎస్ వార్షిక సమావేశాన్ని అభివర్ణించారు. ‘‘ జనాభా అసమతుల్యత’’పై భయాందోళనలు ప్రపంచవ్యాప్తంగా మారణహోమానికి దారి తీశాయని అన్నారు. జాతి ప్రక్షాళన, ద్వేషపూరిత నేరాలకు దారి తీశాయని.. సెర్బియాలో జాతీయవాదులు అల్బేనియన్ ముస్లింల మారణహోమం తరువాత కొసావో దేశం ఏర్పడిందని అసదుద్దీన్ ట్వీట్ చేశారు.

Read Also: kabul Blast: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ పేలుడు.. ముగ్గురు మృతి, 20 మందికి గాయాలు

బుధవారం నాగ్ పూర్ లోని ఆర్ఎస్ఎస్ తన వార్షిక దసరా కార్యక్రమాలను నిర్వహించింది. ఈ సమావేశంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ జనాభా నియంత్రణపై కీలక వ్యాఖ్యలు చేశారు. మతాల జనాభా అసమతుల్యతను విస్మరించొద్దని అన్నారు. జనాభా నియంత్రణ విధానాలకు పిలుపునిచ్చారు మోహన్ భగవత్. జనాభా అసమతుల్యత దేశవిభజనకు దారితీసే అవకాశం ఉందని.. కసావో, దక్షిణ సూడాన్ వంటి దేశాలు జనాభా అసమతుల్యత కారణంగా ఏర్పడినవే అని ఉదహరించారు. జనాభా నియంత్రణ కోసం అందరికి సమానంగా వర్తించే విధానం అవసరమని ఆయన అన్నారు. జనాభా అసమతుల్యత వల్ల దేశంలో భౌగోళిక సరిహద్దుల్లో మార్పు వస్తుందని అన్నారు.

ఇటీవల కాలంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ వరసగా ముస్లిం మేధావులు, మత గురువులతో సమావేశం అయ్యారు. దేశంలో శాంతి సామరస్యాల గురించి వారితో చర్చించారు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత మోహన్ భగవత్ జనాభా నియంత్రణపై మాట్లాడారు. బలవంతంగా మతం మార్చడం, ప్రలోభపెట్టి మతాన్ని మార్చడం, చొరబాట్లు జనాభా అసమతుల్యతకు కారణం అవుతున్నాయని ఆయన అన్నారు. తాజాగా మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు.

Exit mobile version